తిరుమల, 2021 ఫిబ్రవరి 24: తమిళనాడుకు చెందిన తంగదొరై అనే భక్తుడు బుధవారం తిరుమల శ్రీవారికి స్వర్ణ శంఖు, చక్రం కానుకగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీటిని డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌కు అందజేశారు.
అనంతరం ఆలయం వెలుపల తంగదొరై మీడియాతో మాట్లాడుతూ తాను 50 ఏళ్లుగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నానని చెప్పారు. కరోనా సమయంలో శ్రీవారి దర్శనం నిలిపివేశారని, ఆ సమయంలో తాను అనారోగ్యానికి గురయ్యానని అన్నారు. ఆరోగ్యం కుదుటపడితే బంగారు శంఖుచక్రాలు సమర్పిస్తానని స్వామివారికి మొక్కుకున్నానన్నారు. దర్శనం ప్రారంభించిన తరువాత ప్రతి వారం స్వామివారిని దర్శించుకుంటున్నానని చెప్పారు. 3.50 కిలోల బరువు గల ఈ బంగారు శంఖుచక్రాల విలువ దాదాపు 2 కోట్లు అని తంగదొరై తెలిపారు.