శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ , జిల్లా ఎస్పీ డా. కె ఫక్కీరప్ప ఈ రోజు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.దర్శనానికి ముందు వారు దేవస్థానం ఏర్పాటు చేసిన దర్శన క్యూలైన్లను, కరోనా నియంత్రణకు చేపట్టిన ముందస్తు చర్యలను పరిశీలించారు.దేవస్థానం తీసుకుంటున్న ఆయా ముందస్తు జాగ్రత్తల గురించి కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు వివరించారు.ముఖ్యంగా క్యూలైన్ల ప్రవేశద్వారం వద్ద ధర్మల్ గన్ తో శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు చేసిన ఏర్పాట్లు, ఆన్ లైన్ ద్వారా భక్తులు పొందిన దర్శనం రిజిస్ట్రేషన్ పత్రాలను స్కానింగ్ చేసే విధానం, క్యూలైన్ల ప్రవేశద్వారం వద్ద భక్తులు చేతులు శుభ్రపరుచుకునేందుకు ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు, క్యూలైన్లలో భౌతికదూరాన్ని పాటించేందుకు ఏర్పాటు చేసిన వృత్తాలు, క్యూలైన్ల ప్రవేశద్వారము, క్యూలైన్లలో శానిటైజేషన్ కోసం చేసిన ఏర్పాట్లు మొదలైన వాటి గుంచి కార్యనిర్వహణాధికారి వివరించారు .
కరోనా నివారణ గురించి స్థానికులలోనూ, భక్తులలోనూ అవగాహన కల్పించేందుకు పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీబోర్డులు , ఆలయ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ( ఆలయమైకుద్వారా) చేస్తున్న సూచనలు మొదలైన వాటి గురించి కార్యనిర్వహణాధికారి వివరించారు .
నక్షత్ర వనములో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ:
దర్శనం తరువాత , నక్షత్రవనములో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మొక్కలు నాటారు. ఈ నక్షత్రవనములో వారు మేడి, ఉసిరి మొక్కలను నాటారు. దేవస్థానం నిర్మిస్తున్న గణేశసదనం అతిథిగృహానికి( 224 గదులసముదాయం ) దగ్గరలో ఈ నక్షత్రవనం అభివృద్ధి అవుతోంది.
కార్యనిర్వహణాధికారి నక్షత్ర వన ప్రణాళికను వివరిస్తూ నక్షత్రవనములో 27 నక్షత్రాలకు సంబంధించి నాటుతున్న 27 మొక్కల గురించి, నక్షత్రవనము వద్దనే దేవస్థానం ఏర్పాటు చేయనున్న రాశివనం, నవగ్రహవనం. సప్తఋషివనాల గురించి వివరించారు.