శ్రీశైల శ్రీ స్వామి అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ రోజు (07.03.2021) న  సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.తిరుమల తిరపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి  కె.ఎస్.జవహర్ రెడ్డి  పట్టువస్త్రాలను సమర్పించారు.ఈ  కార్యక్రమములో స్థానిక శాసనసభ్యులు  శిల్పా చక్రపాణిరెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ  కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం అధికారులు, అర్చకులు, వేదపండితులు టిటిడి అధికారులకు స్వాగతం పలికారు.అనంతరం ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సంబంధిత సంకల్పం పఠించి  ఆ తరువాత పట్టువస్త్రాలకు పూజాదికాలు నిర్వహించారు.

పూజాదికాలు తరువాత టి.టి.డి అధికారులు, ఆ దేవస్థాన వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేసారు.

ఈ సందర్భంగా టిటిడి కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ జ్యోతిర్లింగస్వరూపుడైన మల్లికార్జునస్వామివారు, మహాశక్తిస్వరూపిణి అయిన భ్రమరాంబాదేవివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయం లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆనవాయితీగా పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు. శ్రీశైల దేవస్థానం అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం తమవంతు సహకారాన్ని అందిస్తుందన్నారు. ఈ విషయాన్ని టిటిడి ట్రస్ట్ బోర్డు వారితో కూడా చర్చిస్తామన్నారు.అనంతరం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టువస్త్రాలను సమర్పించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.

రేపు రాష్ట్ర ప్రభుత్వం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ:

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రేపు (08.03.2021) న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాలశాఖ  మంత్రివర్యులు  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

print

Post Comment

You May Have Missed