శ్రీశైల దేవస్థానం: కరోనా నివారణ చర్యలలో భాగంగా శ్రీశైల దేవస్థానం సిబ్బంది అందరికీ పరీక్షలను నిర్వహిస్తారని కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు తెలిపారు. కరోనాను అరికట్టేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా శ్రీశైల దేవస్థానం సిబ్బందికి ఈ రోజు కరోనా పరీక్షలను నిర్వహించారు.రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ సూచనల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శివదీక్షా శిబిరాల వద్ద ఫుడ్ కోర్టు లో ఈ పరీక్షలను జరుపుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, పొరుగుసేవల సిబ్బందికి ఈ పరీక్షలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు, సహాయకమిషనర్ పి.కోదండరామిరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారులు డి.మల్లయ్య, ఎం.హరిదాసు, జిల్లా వైద్యశాల కో – ఆర్డినేటర్ డా. వెంకటేష్, డా. కుసుమ, డా. రజని, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. ఎం. సోమశేఖరయ్య తదితరులు పాల్గొన్నారు.సుమారు 600 మందికి ఈ రోజు పరీక్షలు నిర్వహించారు. రేపు 24 న కూడా ఈ పరీక్షలు వుంటాయి.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కరోనా నివారణ చర్యలలో భాగంగా సిబ్బంది అందరికీ ఈ పరీక్షలను నిర్వహిస్తారన్నారు.అందరు కూడా స్వీయరక్షణకై అవసరమైన అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడంతో పాటు, శ్రీశైలానికి విచ్చేసే యాత్రికులకు కూడా అవగాహన కల్పించాలన్నారు.ప్రతి ఒక్కరు ఇంటినుండి బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కును ధరించాలన్నారు.
డా. సోమశేఖర్ మాట్లాడుతూ నాజల్ స్వాబ్ టెస్ట్ ద్వారా ఈ పరీక్షలను నిర్వహిస్తారని , సేకరించిన వాటిని జిల్లా కేంద్రం ట్రూనాట్ ల్యాబ్ కు పంపిస్తారన్నారు. ట్రూనాట్ ల్యాబ్ నుండి రెండు లేదా నాలుగు రోజులలో పరీక్షలకు సంబంధించి నివేదిక వస్తుందన్నారు. దేవస్థాన అధికారులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సి.హెచ్.ఓ రంగయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.