శ్రీశైల దేవస్థానం లో మరో ఏడు రోజులపాటు స్వామి అమ్మవార్ల దర్శనాలు నిలిపివేత

 శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రపరిధి  ఇంకా  కంటైన్మెంట్ జోన్ గా కొనసాగుతున్న కారణంగా మరో ఏడు రోజులపాటు ఈ నెల 9వ తేదీవరకు ఆలయములో దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు.ఈ విషయమై స్థానిక తహశీల్దార్,  స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారితో సంప్రదించి, వారి సూచనల మేరకు ఏడు రోజులపాటు దర్శనాలు నిలుపుదల చేసారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా గత నెల 15వ తేదీ నుంచే ఆలయాలలో దర్శనాలను నిలుపుదల చేసారు.ఏడు రోజుల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి తదుపరి చర్యలపై తగు నిర్ణయం తీసుకుంటారు.

యథావిధిగా స్వామి అమ్మవార్ల కైంకర్యాలు

ఈ నెల 9వ తేదీ వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేసినప్పటికీ నిత్యం జరిగే శ్రీస్వామిఅమ్మవార్ల కైంకర్యాలన్నీ యథావిధిగా వుంటాయి. లోకకల్యాణం కోసం జరిపే దేవస్థానం సేవలైన (సర్కారిసేవలైన) సహస్రదీపాలంకరణ సేవ, నందిసేవ, శ్రీస్వామిఅమ్మవార్ల ఊయల సేవ, పల్లకీసేవ, గ్రామదేవత అంకాళమ్మపూజ, క్షేత్రపాలకుడైన బయలువీరభద్రస్వామిపూజ, కుమారస్వామి పూజ, దత్తాత్రేయపూజ మొదలైనవన్నీ యథావిధిగా ఆయా రోజులలో నిర్వహిస్తారు.పరిమిత సంఖ్యలో అర్చకస్వాములు, పరిచారకులు తగు ముందుజాగ్రత్తలతో నిత్యకైంకర్యాలను, సర్కారిసేవలను నిర్వహిస్తారు.

పరోక్షసేవలు కొనసాగింపు:

ఆలయములో దర్శనాలు నిలుపుదల చేసినప్పటికీ భక్తుల సౌకర్యార్థం పరోక్షసేవలను యథావిధిగా కొనసాగుతాయి.

భక్తులు ఆన్లైన్ ద్వారా సేవారుసుము రూ. 1,116/-లను వెబ్ సైట్ – www.srisailamonline.com ద్వారా చెల్లించి, వారి గోత్రనామాలతో పరోక్షసేవలను జరిపించుకోవచ్చు.క్యూ.ఆర్. కోడ్ ను ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, బి.హెచ్.ఐ.ఎమ్, పే.టి.ఎమ్ ద్వారా కూడా సేవా రుసుమును చెల్లించవచ్చు.స్వామివారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, గణపతి హోమం, రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణం, శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకల్యాణం, స్వామివార్ల ఏకాంతసేవలను మరియు వేదాశీర్వచనాన్ని (మొత్తం 10 సేవలు) వారి గోత్రనామాలతో చేయించుకోవచ్చు.

ఈ పరోక్షసేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. భక్తులు ఈ ప్రసారాలను యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చనలను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం లేదు.  ఈ అభిషేక,కుంకుమార్చనల సేవాకర్తలకు వారిసేవ జరిగిన సాయంత్రం వేదాశీర్వచనాన్ని చేస్తారు. ఈ ఆశీర్వచనం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ఇతర వివరములకు దేవస్థానం కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 83339 01351 / 52/53/54/55/ 56 లను సంప్రదించవచ్చును.

  • ఈ రోజు పల్లకీ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు.
print

Post Comment

You May Have Missed