శ్రీశైల దేవస్థానం లో ప్రారంభమైన ఘంటామఠ ఉపాలయాల జీర్ణోద్దారణ పనులు

శ్రీశైల దేవస్థానం: పంచమఠాలలో ఒకటైన ఘంటామఠంలోని ఉపాలయాల జీర్ణోద్ధరణ పనులు ఈ రోజు 14 న ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే ఘంటామఠములోని ప్రధానాలయపు గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, విమానగోపుర నిర్మాణాలు పూర్తి అయ్యాయి.ప్రస్తుతం ఉపాలయాల జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉపాలయాలలోని మూలమూర్తులకు ఆగమశాస్త్రానుసారంగా కళాపకర్షణ జరిగింది.

కళాపకర్షణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం ఘంటామఠ ప్రాంగణములో ముందుగా అర్చకస్వాములు, స్థానాచార్యులు (అధ్యాపకులు) జీర్ణోద్ధరణ సంకల్పాన్ని పఠించారు.తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేసారు. గణపతిపూజ తరువాత అభ్యుదయాన్ని, శ్రేయస్సును కాంక్షిస్తూ పుణ్యాహవచనం జరిగింది.పుణ్యహవచనం చేసిన తరువాత స్థానాచార్యులు, అర్చకస్వాములు, అధికారులు శాస్త్రానుసారంగా పంచగవ్య ప్రాశన చేశారు. ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవు పెరుగు, ఆవు పంచితం, ఆవుపేడ మిశ్రమాలకే పంచగవ్యం అని పేరు.తరువాత మండపారాధన జరిగింది.మండపారాధన తరువాత కుంభస్థాపన (కలశస్థాపన) కుంభాలంకరణ,కుంభపూజ చేసారు.అనంతరం ఉపాలయాలలోని దేవతామూర్తులకు విశేషముగా అభిషేకాది అర్చనలు జరిగాయి. ఈ విశేష పూజల తరువాత కళాపకర్షణ కార్యక్రమం చేసారు.

ఈ కళాపకర్షణలో దేవతామూర్తులకళలను (దేవతామూర్తుల శక్తిని) సూత్రాబంధనం ద్వారా కలశాలలోకి ( కుంభాలలోకి) ఆహ్వానింపజేసారు. జీర్ణోద్ధరణ పనులు పూర్తయ్యేంతవరకు ఘంటామఠములోని దేవతామూర్తులకు జరపాల్సిన పూజలన్నీ ఈ కుంభాలకే (కలశాలకే) చేస్తారు.

కాగా ఈ కలశాలను ఇప్పటికే ఘంటామఠములో ఏర్పాటు చేసిన  బాలాలయములో వేంచేబు చేసారు.

ఈ కార్యక్రమం సందర్భంగా రుద్రపారాయణ, మూలమంత్ర జపాలు చేసారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం పంచమఠాల పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కళాపకర్షణ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి  కె.ఎస్.రామరావు, స్వామివారి ఆలయ ప్రధానార్చకులు ( ఏ/సి) శ్రీ వీరభద్రయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు  పి. మార్కండేయశాస్త్రి, స్థానాచార్యులు పూర్ణానందం, ఆలయ సహాయకార్యనిర్వహణాధికారి  ఎం. హరిదాసు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్  నరసింహారెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్, పర్యవేక్షకులు  శ్రీహరి, సహాయ స్థపతి ఐ. జవహర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమములో స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్  జి. రవీంద్ర, స్థానిక రెవెన్యూశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

*ఊయలసేవ , అంకాళమ్మ విశేష పూజ  జరిగాయి.

print

Post Comment

You May Have Missed