శ్రీశైల దేవస్థానం లో ఆగస్టు 11న గోకులాష్టమి – గోపూజ
శ్రీశైల దేవస్థానం: ఈ నెల 11 న గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలో విశేషంగా గోపూజ నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం గం.9.30ని.ల నుండి ఆలయ ప్రాంగణంలోని ‘శ్రీగోకులం’ వద్ద 11
గోవులకు, 11 గోవత్సవములకు (దూడలకు) పూజాదికాలు నిర్వహిస్తారు.ప్రస్తుతం కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఆలయంలో నిర్ణీత రోజుల వరకు దర్శనాలు నిలిపివేశారు. భక్తులను ఈ పూజలకు అనుమతించే అవకాశం ఉండదు.
కేవలం పరిమిత సంఖ్యలో అర్చకస్వాములు, వేదపండితులు మాత్రమే ఏకాంతంగా ఈ గోకులాష్టమికి సంబంధి పూజలను జరిపిస్తారు.
మన వేదసంస్కృతిలో గోవుకు ఎంతో విశేషస్థానం ఉంది. మన వేదాలు ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు మొదలైనవన్నీ కూడా గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొన్నాయి. గోవు సకల దేవతలకు ఆవాస స్థానం కావడం చేత గోవును పూజించడం వలన దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా గోపూజను ఆచరించడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని, శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా జగన్మాత లలితాపరమేశ్వరి గోవు రూపంలో భూమిపై సంచరిస్తుందని లలితా సహస్ర నామం తెలియజేస్తోంది.
తాను చేసిన ప్రతిపనిలోనూ వైశిష్ట్యాన్ని బోధించిన శ్రీ కృష్ణ పరమాత్మ ఆవుల మంద అధికంగా ఉన్న కారణంగా గోకులంగా పేరొందిన వ్రేపల్లెలో పెరిగి, గోవులను కాసి, గోపాలునిగా పేరుగాంచి, గోవు అనంత మహిమను లోకానికి తెలియజేశాడు. ఈ కారణంగానే గోకులాష్టమి రోజున గోవును పూజించడం సంప్రదాయం అయింది.
గోసంరక్షణలో దేవస్థానం సనాతన సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం గో సంరక్షణకు గాను పలు ప్రత్యేక చర్యలను చేపట్టింది. దేవస్థానం గోశాలను నిర్వహిస్తూ దాదాపు 1350కి పైగా గోవులను సంరక్షిస్తోంది.అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రాత:కాలములో ఆలయప్రాంగణములో దేవస్థానం గో పూజను విశేషంగా నిర్వహిస్తోంది.
Post Comment