×

 శ్రీశైల దేవస్థానంలో 29న వార్షిక ఆరుద్రోత్సవం

 శ్రీశైల దేవస్థానంలో 29న వార్షిక ఆరుద్రోత్సవం

 శ్రీశైల దేవస్థానం:ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకొని డిసెంబరు 29 తేదీన శ్రీ స్వామి వారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఆరుద్రోత్సవాన్ని ప్రతినెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవం వుంటుంది. ఉత్సవాన్ని పురస్కరించుకుని  29 రాత్రి శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల రుద్రాభిషేకం, అన్నాభిషేకం, ఆ మరునాడు 30వ తేదీన తెల్లవారుజామున శ్రీ స్వామివార్ల ప్రాత:కాల పూజల అనంతరం ఉత్తరద్వార దర్శనం, నందివాహన సేవ, ఆలయ ఉత్సవం జరుపుతారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఈ విశేష కార్యక్రమాలువుంటాయి.వాస్తవానికి ఈ ఉత్సవములో గ్రామోత్సవము నిర్వహించబడాల్సి ఉండగా, కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా ఆలయ ఉత్సవము మాత్రమేజరుపుతారు.

ఈ ఉత్సవంలో భాగంగా 29.12.2020 రాత్రి గం.10.00లకు నిర్విఘ్నంగా ఉత్సవం జరగాలని ముందుగా గణపతిపూజ వుంటుంది. తరువాత లోక కల్యాణం కోసం  ఉత్సవ సంకల్పం చేస్తారు. అనంతరం మహాన్యాసాన్ని జరిపి శ్రీ స్వామివారికి లింగోద్భవకాల రుద్రాభిషేకం చేస్తారు.

ఆ మరునాడు (30.12.2020) వేకువజామున గం.3.00లకు మంగళవాయిద్యాల అనంతరం గం. 3.30 ని||లకు సుప్రభాతసేవవుంటుంది.

తరువాత శ్రీ స్వామివార్లకు ప్రాత:కాలపూజలను జరిపించిన అనంతరం శ్రీ స్వామివార్ల ఉత్సవ మూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు  తరువాత ముఖమండప ఉత్తర ద్వారాన్ని తెరచి భక్తులకు ఉత్సవమూర్తుల ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు .

ఈ ఉత్సవంలో భాగంగానే ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తరద్వారం నుండి వెలుపలకు తోడ్కొనివచ్చి ఆలయ ఉత్తరభాగంలోనే నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు జరుపుతారు.

తరువాత ఆలయప్రాంగణములోనే స్వామివార్ల ఆలయ ప్రదక్షిణ వుంటుంది.

శ్రీ స్వామి అమ్మవార్ల ఆలయ ప్రదక్షిణ ప్రారంభమైన తదుపరి ఉదయం గం.6.00 ల తరువాత భక్తులను సర్వదర్శనానికి, ఆర్జిత సేవలకు అనుమతిస్తారు.

*Sahasradeepaarchana seva performed in the temple today.

print

Post Comment

You May Have Missed