శ్రీశైలదేవస్థానం: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలదేవస్థానం లో 25.12.2020న శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవం సందర్భంగా ఆరోజు వేకువజామున శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్తర ద్వార దర్శనం, రావణవాహనసేవ ఆలయ ఉత్సవం నిర్వహిస్తారు.
కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఈ విశేష కార్యక్రమాలు ఉంటాయి.
రావణవాహనసేవ, గ్రామోత్సవం నిర్వహించవలసియుండగా కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని కేవలం ఆలయ ఉత్సవానికే పరిమితం చేస్తారు. ఆలయ వేళల్లో కూడా మార్పులు ఉన్నాయి.
ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం గం.3.00లకు ఆలయ ద్వారాలను తెరచి మంగళ వాయిద్యాల అనంతరం గం.3.30ని||లకు స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహిస్తారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాత:కాలపూజలు జరిపించి గం.4.30 ని||లకు స్వామివారికి, తరువాత అమ్మవారికి మహామంగళహారతులు నిర్వహిస్తారు.
ఈ ఉత్సవంలో భాగంగానే ఉదయం స్వామివారి విశేషపూజల తరువాత గం.5.00లకు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తరద్వారం నుండి వెలుపలకు తోడ్కోనివచ్చి ఆలయ ఉత్తర భాగంలో రావణవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు జరుపుతారు.
తరువాత స్వామివార్ల ఆలయ ఉత్సవం ఉంటుంది.
శ్రీ స్వామివారి ఆలయ ఉత్సవం ప్రారంభమైన తదుపరి ఉదయం గం.6.00 ల తరువాత భక్తులను సర్వదర్శనానికి, ఆర్జిత సేవలకు అనుమతిస్తారు.