శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో మకర సంక్రమణ పుణ్యకాలం సందర్భంగా జనవరి 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
పంచాహ్నికదీక్షతో ఏడురోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
సంప్రదాయాన్ని అనుసరించి శ్రీమల్లికార్జునస్వామివారికి ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం.
ఈ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఈ రోజు 05.01.2021న సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
కాగా సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణములో స్థానిక చెంచుగిరిజనులు ప్రత్యేకంగా పాల్గొంటారు. ఈ కారణంగా ఈ సమావేశానికి స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీ రవీంద్రదారెడ్డి గారిని ఆహ్వానించారు.
బ్రహ్మోత్సవ కల్యాణంలో చెంచు భక్తులు ప్రత్యేకంగా స్వామిఅమ్మవార్లకు నూతనవస్త్రాలు, తేనె, పండ్లు, వెదురు బియ్యం , ఆకులతో అల్లిన బాసికాలు, స్వామివారికి యజ్జోపవీతం, అమ్మవారికి వడ్డాణం మొదలైనవాటిని సమర్పిస్తారు.
గత సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలకు పలు ప్రాంతాల నుండి కూడా చెంచు భక్తులను ఆహ్వానించారు. ఈ సంవత్సరం కూడా స్థానిక ఐ.టి.డి.ఎ. వారి సహకారంతో వివిధ ప్రాంతాల నుండి చెంచు భక్తులు బ్రహ్మోత్సవ కల్యాణంలో పాల్గొనే ఏర్పాట్లు చేస్తున్నారు.
సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి ప్రారంభప్రసంగాన్ని చేశారు. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని కార్యనిర్వహణాధికారి అన్నారు . ఉత్సవరోజులలో శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని ఎలాంటి లోటులేకుండా పరిపూర్ణంగా జరిపించాలని సూచించారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.అనంతరం విభాగాల వారిగా చేయవలసిన ఏర్పాట్లను సమీక్షించారు.
కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.
క్యూలైన్లో భక్తులు ముఖానికి మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరుచుగా చేతులు శుభ్రపరుచుకోవడం లాంటి అంశాలపై మరింత అవగాహన కలిగించాలన్నారు. ఈ విషయమై ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా తరుచుగా భక్తులకు తెలియజెప్పాలన్నారు.
అన్నదాన భవనములో పంక్తి భోజనాలకు అవకాశం లేని కారణంగా ప్రస్తుతం అమలులో ఉన్నట్లుగానే భక్తులందరికీ అన్నప్రసాదాలను పొట్లాలరూపంలో అందించాలన్నారు. ఉదయం 10గంటల నుంచే ఈ వితరణను ప్రారంభించాలని అన్నదాన విభాగాన్ని ఆదేశించారు.
భక్తులరద్దీకనుగుణంగా తగినన్ని లడ్డు ప్రసాదాలను సిద్ధంగా ఉంచుకోవాలని ప్రసాదాల విభాగాన్ని ఆదేశించారు.
పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, ప్రధాన రహదారుల్లోనే కాకుండా అంతర్గత వీధుల్లో కూడా ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేయాలని ఉద్యానవన అధికారిని ఆదేశించారు.బ్రహ్మోత్సవాలలో క్షేత్రానికి విచ్చేసే భక్తులకు బ్రహ్మోత్సవ విశేషాలు తెలిసేవిధంగా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.
ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణంలో చెంచుగిరిజనులు పాల్గొనే విధంగా చెంచు భక్తులలో అవగాహన కల్పిస్తారన్నారు . కర్నూలు జిల్లా నుంచే కాకుండా ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి కూడా చెంచు భక్తులను బ్రహ్మోత్సవ కల్యాణానికి తోడ్కొనివస్తారన్నారు.
కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించే అవకాశం లేదు. ఉత్సవ సమయములో ప్రతిరోజూ ప్రాకారోత్సవం మాత్రమే ఉంటుంది. ఈ ప్రాకారోత్సవములో ఆలయమాడవీధులలో శ్రీస్వామి అమ్మవార్ల ఊరేగింపు ఉంటుంది.
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు
ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభంగా జనవరి 11వ తేదీన ఉదయం గం.8.30లకు శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశ కార్యక్రమం తరువాత వేదపండితులు చతుర్వేద పఠనాన్ని చేస్తారు.అనంతరం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. సంకల్పపఠనం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ ఉంటుంది. గణపతి పూజ తరువాత కంకణధారణ, ఋత్విగ్వరణం, అఖండ దీపారాధన, వాస్తుపూజ, వాస్తు హోమం, మండపారాధనలు, కలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, పారాయణలు నిర్వహిస్తారు.
ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ పారాయణలలో స్కాందపురాణములోని శ్రీశైలఖండ పారాయణ కూడా చేస్తారు.
అదేరోజు సాయంకాలం అంకురారోపణ, అగ్నిప్రతిష్టాపనల తరువాత ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయి.
ముక్కోటి దేవతలను, సకల సృష్టిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకుగాను ఈ ధ్వజారోహణ కార్యక్రమం చేస్తారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగానే ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం, చండీహోమం, నిత్యహవనాలు చేస్తారు.
బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు 12వ తేది నుండి శ్రీస్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు.
14వ తేది మకరసంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.
16వ తేదీ ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన 17వ తేది రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు.
ఆర్జిత సేవలు నిలుపుదల • ఉత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఆర్జిత హోమాలైన రుద్రహోమం ,
మృత్యుంజయ హోమం, చండీహోమం, , ఏకాంతసేవలను నిలపుదల
చేస్తారు. • అయితే అభిషేకం, కుంకుమార్చనలు యథావిధిగా ఉంటాయి.
సామూహిక భోగిపండ్లు
భోగిరోజున 13వ తేదీన ఉదయం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉచితంగా సామూహిక భోగిపండ్ల కార్యక్రమం నిర్వహిస్తారు. సనాతన ధర్మపరిరక్షణలో భాగంగా ఈ సామూహిక భోగిపండ్ల కార్యక్రమాలు చేస్తారు.
5 సంవత్సరాల వరకు వయస్సుగల చిన్నారులకు ఈ భోగిపండ్లు పోస్తారు. • ఈ భోగిపండ్ల కార్యక్రమములో పాల్గొనదలచిన వారు 12వ తేదీ సాయంత్రం గం.5.00లలోపల ప్రజాసంబంధాల విభాగంలో వారి పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది.
ముగ్గుల పోటీలు : • సంక్రాంతి సందర్భముగా మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు. • సంక్రాంతి రోజున 14వ తేదీన ఉదయం ఈ పోటీలు ఉంటాయి . • ముగ్గుల పోటీలలో పాల్గొనదలచిన వారు 13వ తేదీ సాయంత్రం గం.5.00లలోగా ప్రజాసంబంధాల అధికారి విభాగములో పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది. వేదసభ గత సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరము సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో సదస్యం రోజున 16వ తేదీన నిర్వహిస్తారు .