శ్రీశైల దేవస్థానంలో సూర్యారాధన పూజలు

*Datthaathreya Vishesha Puuja performed in Srisaila temple on 18th February 2021.

 శ్రీశైల దేవస్థానం:రథసప్తమి పర్వదినం సందర్భంగా  రేపు (19.02.2021) న  ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్యారాధన పూజలను నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముందుగా, దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు జరగకుండా ఉండాలనీ, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోక కల్యాణ సంకల్పాన్ని చెప్పనున్నారు.

తరువాత కలశస్థాపనచేసి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేస్తారు. అనంతరం వైదికాచార్యులు ఆయా బీజమంత్రాలతోనూ, ప్రత్యేక ముద్రలతోనూ సూర్యనమస్కారాలు చేయిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగానే సూర్యయంత్ర పూజ, చతుర్వేద పారాయణం,అరుణపారాయణ, చేస్తారు. అనంతరం మధ్యాహ్నం గం. 12.00లకు సూర్యభగవానుడికి ఉత్తర పూజనము (షోడశోపచారపూజ), నివేదన, మంత్రపుష్పము నిర్వహిస్తారు.

కార్యక్రమంలో చివరిగా భక్తులందరిపై సూర్యాభిషేక జలాన్ని ప్రోక్షించి తీర్థప్రసాదాలను అందిస్తారు.

కాగా మన పురాణాలలో ఈ సూర్యారాధన గురించి  ఎంతో విశేషంగా పేర్కొన్నారు. సూర్యారాధన వల్ల అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించడం ఎంతో ఫలదాయకం.

మన్వంతర ప్రారంభంలో సూర్యభగవానుడు మాఘశుద్ధ సప్తమి రోజున మొట్టమొదటిసారిగా తన ప్రకాశాన్ని లోకాలకు అందించాడని చెబుతారు. అందుకే సూర్యుడు జన్మించిన రథసప్తమి రోజును సూర్యజయంతిగా జరుపుకోవడం ఆచారంగా కొనసాగుతోంది.

*సూర్య నమస్కారాలు:

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు (19.02.2021) ప్రత్యేకంగా “సూర్య నమస్కార” కార్యక్రమము నిర్వహిస్తారు.

ధర్మప్రచారంలో భాగంగా ఆలయ దక్షణ మాడవీధిలో భ్రామరీ కళావేదిక లో  ఉదయం గం.07.00 నుండి గం. 08.30ల వరకు “సూర్యనమస్కార” కార్యక్రమం  ఉంటుంది.

ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ యోగ గురువులు విచ్చేసి సూర్య నమస్కారాల విశేషాలను వివరిస్తారు. అదేవిధంగా సూర్య నమస్కారాలతో ముడిపడి ఉన్న మొదలైన పలు రకాల ఆసనాలను కూడా వేయిస్తారు.

మన భారతీయ సంస్కృతిలో సూర్య నమస్కారాలకు ఎంతో విశేషం ఉంది. ప్రధానంగా వీటిని విశిష్టమైన ఆసన సరళిగా భావిస్తారు. అదేవిధంగా శ్వాస నియంత్రణ, ధ్యాన పద్ధతిలో కూడా సూర్య నమస్కారాలు ప్రముఖంగా ఉన్నాయి.

ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మన శరీరంలోని కండరాలు , పలు అవయవాలకు వ్యాయమం కలుగుతుంది.

అందుకే సూర్య నమస్కారాలను గొప్ప వ్యాయమ ప్రక్రియాగా కూడా పేర్కొంటారు.

print

Post Comment

You May Have Missed