శ్రీశైల దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా ఆషాఢ పౌర్ణమి, శాకంభరీ ఉత్సవం

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు వివిధ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. దేవస్థానం ఈ ఓ తదితరులు పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో శ్రీభ్రమరాంబాదేవివారి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని,ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరిదేవి, ఆలయప్రాంగణములోని సప్తమాతృకలు, గ్రామదేవత అంకాళమ్మకు శాకాలంకరణ, ఉత్సవసంబంధిపూజాదికాలు జరిపారు.ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఆలయప్రాంగణాన్ని పలురకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు.ఇందుకోసం అవసరమైన సుమారు 40 రకాలకు పైగా ఆకుకూరలు, కూరగాయలను, వివిధ రకాల ఫలాలను తెప్పించారు.సుమారు 3,500 కేజీల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలను ఈ ఉత్సవంలో వినియోగించారు. దేవస్థానం సూచనల మేరకు పలువురు దాతలు వీటిని విరాళంగా సమర్పించారు. వంగ,బెండ, దొండ, కాకర, చిక్కుడు,గోరుచిక్కుడు, మునగ, సొర, బీర, గుమ్మడి బంగాళదుంప, కందదుంప, క్యాప్సికమ్ (బెంగుళూరు మిరప), క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటి మొదలైన వివిధ రకాల కూరగాయలు, తోటకూర,పాలకూర, మెంతికూర, చుక్కకూర, మొదలైన పలురకాల ఆకుకూరలు, పుదీన, కరివేపాకు, కొత్తిమీర ంటి సుగంధ పత్రాలు, కమల, బత్తాయి, ద్రాక్ష, ఆపిల్, అరటి, ఫైనాపిల్ మొదలైన పలురకాల ఫలాలు, నిమ్మకాయలు, బాదంకాయలు,  పచ్చిశనగలు మొదలైన వాటిని ఈ ఉత్సవానికై తెప్పించారు.కాగా ఈ ఉత్సవంలో భాగంగా ఆగమశాస్త్రానుసారంగా శ్రీభ్రమరాంబాదేవివారికి ఉత్సవ సంబంధి పూజాదికాలు చేసారు.కార్యక్రమములో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ  సంకల్పం చెప్పారు.సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారంచబడాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, జనులందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.అదేవిధంగా జనులందరూ ఆరోగ్యంగా వుండాలని, మానవులకు హానిచేసే సూక్ష్మజీవులు వ్యాప్తి చెందకుండా నిరోధించబడాలని కూడా సంకల్పములో చెప్పారు.తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ చేసారు.ఉత్సవంలో భాగంగానే శాకంభరీగా అలంకరించబడిన అమ్మవారి ఉత్సవమూర్తికి కూడా విశేషంగా షోడశోపచారపూజలు చేసారు. పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్జానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువు కాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన అమ్మవారి స్వరూపమే శాకంభరీదేవి. ఆషాఢ పౌర్ణమిరోజున అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పాడిపంటలు బాగా పండుతాయని, కరువు కాటకాలు నివారించబడుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం ఎంతో శాస్తోక్తంగా అమ్మవారికి ఈ కైంకర్యాన్ని చేస్తారు.

| గురుపౌర్ణమి విశేషపూజలు |

గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు  ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి – హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణామూర్తిస్వామివారికి, ,వ్యాసమహర్షికి విశేష పూజలను జరిపారు. ఈ కార్యక్రమానికి ముందుగా పూజా సంకల్పం తరువాత మహాగణపతిపూజ, దక్షిణామూర్తి , వ్యాసమహర్షి చిత్రపటాలకు షోడశోపచారపూజలు జరిపారు.ఈపూజల అనంతరం వేదపండితులు చతుర్వేద పారాయణలను చేశారు. చివరగా అర్చకులు, వేదపండితులు గురుపరంపర మంత్రాలను పఠించారు.ఇక ఒకే రాశిగా ఉన్న వేదాన్ని నాలుగు విభాగాలుగా చేసి లోకాలకు అందించిన వ్యాసమహర్షి కారణజన్ముడు. వ్యాసమహర్షి అసలు పేరు ” కృష్ణద్వైపాయనుడు” వేదాలను నాలుగు విభాగాలుగా విభజించి లోకానికి అందించిన కారణంగా ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు ప్రసిద్ధమైంది. మంత్ర రూపంలో ఉన్న వేదాల  పరమార్థాన్ని గ్రహించలేని సామాన్యులకోసం వ్యాసమహర్షి మహాభారతాన్ని కూడా రచించాడు. అందువలననే మహాభారత గ్రంథం పంచమవేదంగా పేరొందింది.  లోకోద్ధరణ కోసం వ్యాసమహర్షి పురాణాలను కూడా రచించారు.లోకంలో ఉండే ప్రతీ విషయాన్ని కూడా వ్యాసమహర్షి తన సాహిత్యంలో పేర్కొన్నారు. అందుకే ఆయన చెప్పని విషయాలు ఏవీ లోకంలో కనబడవనే భావన ఎంతో ప్రసిద్ధం.

అమ్మవారికి పల్లకీసేవ:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపారు.

ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి , మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు . 

అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్తోక్తంగా షోడశోపచారపూజలు చేసారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం జరిపారు.ఈ ఉత్సవములో శ్రీస్వామి అమ్మవార్లను వేంచేబు చేసే పల్లకి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ ఈ పల్లకీ సేవను  నిర్వహించారు.

| శ్రీ సాక్షిగణపతి స్వామికి విశేష అభిషేకం:లోక కల్యాణం కోసం పౌర్ణమిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. కాగా ప్రతి బుధవారం, సంకటహరచవితిరోజులు,  పౌర్ణమిరోజులలో శ్రీ సాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం,  పూజాదికాలు దేవస్థానం సేవగా సర్కారిసేవగా నిర్వహించారు.ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం జరిపారు.తరువాత స్వామివారికి విశేషపుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిగాయి. వైదిక సంప్రదాయాలలో గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని ప్రతీతి. కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని నమ్మకం.కాగా శ్రీశైలక్షేత్ర పరివార ఆలయాలలో సాక్షిగణపతి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లుగా కైలాసంలో పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ధి. అందుకే ఈ స్వామి సాక్షిగణపతిగా పేరొందాడు. చక్కని నల్లరాతితో మలచబడిన ఈ స్వామి ఒకచేతిలో కలం, మరో చేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు.అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ సాక్షిగణపతికి విశేషార్చనలు జరిపారు.

print

Post Comment

You May Have Missed