శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవను నిర్వహించింది.
ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ జరుగుతుంది .ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈ
ఊయలసేవ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని , తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు.అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు షోడశోపచార పూజ జరిపారు.ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. చివరగా ఊయల సేవ జరిపారు.ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు చేసారు.పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించారు.అర్చకస్వాములు, వేదపండితులు భౌతికదూరాన్ని పాటిస్తూ ఈ ఊయల సేవను జరిపారు.
అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు
లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఈ రోజు ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.ప్రతి శుక్రవారం శ్రీ అంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ ఉంటుంది.ఇందులో భాగంగా ఉదయం గం.6.30లకు శ్రీ అంకాళమ్మ అమ్మవారికి అభిషేకం, విశేష పుష్పాలంకరణ, విశేషపూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగాగల రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతంలో ఉంది. ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. దైవశక్తి సమాజంలో ఏదో కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి యొక్క ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామదేవత ఆరాధనను పేర్కొన్నవచ్చు.చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి, సర్పంలో చుట్టబడిన ఢమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది. కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపారు. ఆ తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం పూజలను జరిపారు. అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ అంకాళమ్మ అమ్మవారికి విశేషార్చనలు జరిపించారు.