శ్రీశైల దేవస్థానం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహించింది.ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజిస్తారు. ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది.ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది. ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపారు.తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, 5 రకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రాదోకంతోనూ, మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం జరిపించారు.ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను చేసారు.అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ జ్వాలావీరభద్రస్వామికి విశేషార్చనలు జరిపించారు.
| శ్రీ సాక్షిగణపతి స్వామికి విశేష అభిషేకం
లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది.
ప్రతి బుధవారం, సంకటహరచవితి రోజులు, , పౌర్ణమి రోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తున్నారు.ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం జరిగింది తరువాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపారు ఇందులో భాగంగానే విశేషంగా గణపతి హోమం కూడా జరిగింది.
వైదిక సంప్రదాయాలలో గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని నమ్మకం. కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని నమ్మకం.
శ్రీశైలక్షేత్ర పరివార ఆలయాలలో సాక్షిగణపతి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లుగా కైలాసంలో పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ది. అందుకే ఈ స్వామి సాక్షిగణపతిగా పేరొందాడు. చక్కని నల్లరాతితో మలచబడిన ఈ స్వామి ఒకచేతిలో కలం, మరో చేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు.
అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ సాక్షిగణపతికి విశేషార్చనలు జరిపారు.