కరోనాను అరికట్టేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా సిబ్బందికి విడతలవారిగా శిక్షణ అందజేయాలని శ్రీశైల దేవస్థానం సంకల్పించింది. శివదీక్షా శిబిరాల వద్ద గల ఫుడ్ కోర్టులో ఈ శిక్షణా కార్యక్రమాలు చేపట్టారు.
నిన్నటి రోజున భద్రతా విభాగపు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
ఈ రోజు జరిగిన శిక్షణా కార్యక్రమ మొదటి విడతలో దేవస్థానం కల్యాణకట్ట సిబ్బందికి, రెండవ విడతలో పారిశుద్ధ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
కల్యాణకట్ట సిబ్బందిలో మొత్తం 120 మందికి, పారిశుద్ధ్యపు విభాగములోని 118 మందికి ఈ శిక్షణఇచ్చారు.
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. ఎం. సోమశేఖరయ్య, దేవస్థాన వైద్యులు డా.శివప్రకాశ్ లు ఈ శిక్షణను అందించారు.
డాక్టర్ సోమశేఖరయ్య మాట్లాడుతూ కరోనాను అరికట్టేందుకు తీసుకోవాలసిన ముందు జాగ్రత్త చర్యల గురించి వివరించారు. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కును ధరించాలని, అదేవిధంగా ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.
తరచుగా కళ్ళు, ముక్కు, నోటిని తాకకూడదన్నారు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విధిగా మోచేతిని అడ్డుపెట్టుకోవడంగాని లేదా టిష్యూ పేపరును గాని వినియోగించాలన్నారు. తరచుగా తాకే తలుపుల చిలుకులు ( డోర్ హ్యాండిల్), రైలింగులను ఎట్టిపరిస్థితులలోనూ తాకకూడదన్నారు. ముఖ్యంగా అందరు కూడా వారి వారి మోబైల్ ఫోన్ లో ఆరోగ్యసేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజెప్పారు. మధుమేహం, గుండెజబ్బులు, రక్తపోటు మొదలైన వ్యాధులతో బాధపడేవారు వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వారు తీసుకునే మందులను క్రమం తప్పకుండా వాడాలన్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం కూడా మంచి ఫలితాన్నిస్తుందని చెప్పారు.
తరువాత వారు మాస్కు ధరించడం, నిర్ణీత సమయం తరువాత మాస్కును తీసివేయడం, శానిటైజర్ లేదా సబ్బునీటితో చేతులను శుభ్రపరుచుకునే విధానం, శుభ్రపరుచుకోవడంలో గల దశలు, చేతులకు తొడుగులను (హ్యాండ్ గ్లాస్ లను) ధరించడం, నిర్ణీత సమయం తరువాత గ్లెను తీసివేయడం, వినియోగించిన మాస్కులను, గ్లెను నిర్మూలించే విధానం, ధర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరీక్షించే విధానం, క్యూలైన్లు మొదలైన చోట్ల దేవస్థానం ఏర్పాటు చేయనున్న ఫుట్ ఆపరేటింగ్ శానిటైజింగ్ స్టాండును వినియోగించే విధానం మొదలైన అంశాలు మొదలైన వాటిని ప్రయోగపూర్వకంగా (డెమోద్వారా) వైద్యులు సిబ్బందికి తెలియజెప్పారు.
దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారులు డి. మల్లయ్య, ఎం. హరిదాసు, పర్యవేక్షకులు శ్రీహరి, జి.స్వాములు కల్యాణకట్ట, పారిశుద్ధ్యం సిబ్బంది పాల్గొన్నారు.