శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేష పూజలు జరిపింది.ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహిస్తున్నారు.ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం చేసారు.
| నందీశ్వరస్వామికి విశేషపూజ |
లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరస్వామి (శనగల బసవన్న స్వామి)కి విశేషార్చనలు జరిపింది.
ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం ఉంటుంది. ప్రదోషకాలంలో సాయం సంధ్యా సమయంలో ఈ విశేషపూజలు నిర్వహించారు.కాగా ఈ రోజు మంగళవారముతో పాటు త్రయోదశి కూడా కలిసి రావడం విశేషం.
ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్నిసామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పారు.అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను జరిపారు .ఆ తరువాత నందీశ్వరస్వామికి పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిపారు.
పురుష సూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో ఈ విశేషాభిషేకాన్ని చేసారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేసారు. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన చేసారు.
శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం:
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించింది.
ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) చేస్తున్నారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిపి, అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, సుబ్రహ్మణ్య అష్టోత్తరము , అనంతరం సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేశారు.సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు,తేనే,నెయ్యి, కొబ్బరినీళ్లు, వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.