రాష్ట్ర దేవదాయశాఖ కమీషనర్ ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానంలో ప్రయోగాత్మక పరిశీలనగా దర్శనాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి.భక్తులను దర్శనాలకు అనుమతించే విషయమై కమీషనర్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా దర్శనాలు ప్రారంభించారు.ఈ రోజు దేవస్థానం సిబ్బందిని దర్శనానికి అనుమతించారు. 9 న సిబ్బందితో పాటు స్థానికులను కూడా అనుమతిస్తారు.సిబ్బంది ముందస్తుగా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ పొంది ఫేసుమాస్కులను ధరించి, గుర్తింపు కార్డులతో దర్శనానికి వచ్చారు.
దర్శనప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరీక్షించారు.
ఈ ప్రవేశమార్గం వద్దనే ఆన్ లో పొందిన దర్శన రిజిస్ట్రేషన్ పత్రాన్ని స్కాన్ చేసి దర్శనానికి అనుమతిస్తున్నారు.
క్యూలైన్ ప్రవేశమార్గం వద్దనే భక్తులు చేతులు శుభ్రపరుచుకునేందుకు వీలుగా నీటికుళాయిలు ఏర్పాటు చేసారు.
చేతులను శానిటైజేషన్ చేసుకునేందుకు వీలుగా క్యూలైన్ ప్రవేశద్వారం వద్ద, మహాద్వారం వద్ద, పలుచోట్ల శానిటైజర్లను ఏర్పాటు చేసారు.మహాద్వారం వద్ద భక్తులు కాళ్లు కడుకునేందుకు కూడా తగు సౌకర్యాలు కల్పించారు.
భక్తుల సౌకర్యార్థం లెగ్ ఆపరేటెడ్ శానిటైజింగ్ స్టాండులను ఏర్పాటు చేసారు. ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఎప్పటికప్పుడు క్యూలైన్లను శుభ్రం చేసారు.క్యూలైన్ల పైపులను కూడా నిర్ణీత సమయాలలో శానిటైజెషన్ చేసారు. క్యూలైన్లలో భక్తులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా వృత్తాలతో మార్కింగ్ చేసారు.ప్రస్తుతానికి శ్రీస్వామిఅమ్మవార్ల లఘుదర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు.
తీర్థం, ఉచిత ప్రసాద వితరణ, శఠారీ ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసారు. కరోనాను అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు మొదలైన వాటి గురించి భక్తులలో అవగాహన కలిగించేందుకు దేవస్థానం ప్రసార వ్యవస్థ ద్వారా ( మైకు ద్వారా) ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. భక్తులలో అవగాహన కల్పించేందుకు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఫ్లెక్సీ బోర్డులను కూడా పలు చోట్ల ఏర్పాటు చేసారు.