శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈ రోజు 31న పరోక్ష ఆర్జిత సేవగా వరలక్ష్మీవ్రతాన్ని నిర్వహించింది. ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామి అమ్మవార్లనిత్యకల్యాణ మండపంలో ఈ వ్రతం జరిగింది.ఈ పరోక్షసేవకు రూ.1,116-00లను రుసుముగా నిర్ణయించారు . మొత్తం 206 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ పరోక్షసేవను జరిపించుకున్నారు.స్థానిక శాసనసభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డి కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషనుతో ఈ వరలక్ష్మీవ్రతాన్ని చేసారు.
అదేవిధంగా తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటకలోని పలు ప్రాంతాల నుండి, మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతం నుండి కూడా పలువురు భక్తులు ఈ వరలక్ష్మీవ్రతానికి ఆన్లైన్ రిజిప్టేషన్ చేయించుకోవడం జరిగింది. ఇంకా మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరము నుండి ఒక భక్తుడు, ఉత్తరప్రదేశ్ లోని లక్నో నగరము నుండి మరో భక్తుడు ఈ వరలక్ష్మీవ్రతానికి ఆన్లైన్ రిజిప్టేషన్ చేయించుకున్నారు.సేవాదారులందరికీ స్వామివారి విభూతి, అమ్మవారి కుంకుమ, అక్షతలు, కలకండ ప్రసాదం, అమ్మవారి శేషవస్త్రం పోస్టుద్వారా పంపుతారు.
సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వ్రతములో ముందుగా వ్రతసంకల్పం పఠించారు. ఈ సంకల్పములో సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పాడిపంటలతో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, అందరికి శ్రేయస్సు కలగాలని కోరారు.
ప్రజలందరూ రోగాలకు గురికాకుండా ఆరోగ్యంగా వుండాలని, ముఖ్యంగా ఆరోగ్యాన్ని హాని కలిగించే కరోనా వైరస్ వ్యాప్తి నివారించబడి, ప్రస్తుత విపత్కర పరిస్థితులు తొలగిపోయి, జనులందరికీ సుఖశాంతులు కలగాలని కూడా సంకల్పములో ప్రత్యేకంగా పేర్కొన్నారు.తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు షోడశోపచారపూజలు చేసారు.
తరువాత వరలక్షీవ్రతంజరిగింది. ఈ వ్రతములో ముందుగా కలశస్థాపన చేసి వరలక్ష్మీదేవి వారిని సమంత్రకంగా ఆవహింపచేసారు. తరువాత వ్రతకల్ప ప్రకారంగా వరలక్ష్మీదేవి వారికి షోడశోపచారపూజలు జరిగాయి. అనంతరం ఆలయ అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమావిశేషాలను చదివి వినిపించారు. చివరగా నీరనాజన మంత్రపుష్పాలను జరిపి కలశోద్వాసనతో వ్రతసమాప్తి అయింది.
కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ మన వైదిక సంప్రదాయంలో శ్రావణ మాసాన వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తున్నదని అన్నారు. ఈ వ్రత ఆచరణను గురించి పరమేశ్వరుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు స్కాందపురాణములో చెప్పబడినట్లుగా పండితులు పేర్కొంటున్నారని అన్నారు.
” వర అంటే ” శ్రేష్ఠమైన, ఉన్నతమైన అనే అర్థాలు వున్నాయని, వరలక్ష్మీ వ్రతాచరణ వలన శ్రేష్ఠమైనవి, ఉన్నతమైనవి మనకు లభిస్తాయని అన్నారు. అందుకే ఈ వ్రతానికి వరలక్ష్మీ వ్రతం అనే పేరు వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేయడం వలన మనకు సకల సంపదలు లభిస్తాయని చెబుతూ, సాధారణంగా చాలా మంది ధన దాన్యాదులనే సంపద అని అనుకుంటూ వుంటారని, కానీ ఉత్సాహం, ఆనందం, శాంతం, శోభ,ఆరోగ్యం, ఆయువు, కీర్తి, ప్రతిష్ట, శక్తి, సామర్థ్యం మొదలైనవన్నీ కూడా సంపదలుగానే భావించాలన్నారు.కాగా శుచిశుభ్రత, సామరస్య వాతావరణం, మంచి అలవాట్ల వంటి లక్షణాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవని చెబుతూ, సదాచారాలలో, సత్కర్మలలో, సదాశయాలలో లక్ష్మీదేవి అంతర్లీనంగా వుంటుందని పురాణాలు చెబుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరము దేవస్థానము సామూహిక వరలక్ష్మీవ్రతాలను నిర్వహిస్తుండేదని, అయితే కరోనావ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ప్రస్తుతం దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేసిన కారణంగా భక్తుల సౌకర్యార్థమై వరలక్ష్మీవ్రతాన్ని పరోక్షసేవగా చేశామన్నారు.
అమ్మవారికి పల్లకీసేవ
లోకకల్యాణం కోసం మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం చేసారు.ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) చేసారు.
ఊయలసేవ
లోకకల్యాణం కోసం శుక్రవారం, మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు సాయంకాలం శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవను జరిపారు.
అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు
లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఈ రోజు ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.ప్రతి శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ ఉంటుంది.