శ్రీశైల దేవస్థానంలో ఆర్జిత పరోక్షసేవగా గణపతి పూజ
శ్రీశైల దేవస్థానం: 22 నుండి గణపతి నవరాత్రులు: హుండీల లెక్కింపు : సౌండ్ అండ్ లైట్ షో పనుల పరిశీలన: ఆధ్యాత్మిక గ్రంథాల ఆవిష్కరణ:
భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈ నెల 22న వినాయకచవితి సందర్భంగా సాక్షిగణపతి ఆలయము వద్ద ‘గణపతిపూజ’ను ఆర్జిత పరోక్షసేవగా నిర్వహిస్తోంది.
ఆరోజున ఉదయం 8.30గంటల నుండి ఈ పూజాదికాలు ఉంటాయి.
భక్తులు ఆన్లైన్ ద్వారా సేవారుసుము చెల్లించి పరోక్షంగా ఈ గణపతిపూజను జరిపించుకోవచ్చు.
కాగా ఈ పరోక్షసేవకు భక్తులు రూ.1,116-00లు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సేవారుసుమును దేవస్థానం వెబ్ సైట్ – www.srisailamonline.com ద్వారా చెల్లించవచ్చు.
అదేవిధంగా క్యూ.ఆర్.కోడ్ ను ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, బి.హెచ్.ఐ.ఎమ్, పే.టి.ఎమ్ ద్వారా సేవా రుసుమును చెల్లించే సదుపాయం కూడా ఉంది.
సేవాకర్తలు వారి పేరున జరిగే సేవను వీక్షించేందుకు వీలుగా దేవస్థానం యూ ట్యూబ్ ద్వారా ఈ గణపతిపూజను అనంతర ప్రసారం (రికార్డెడ్ ప్రసారం) చేస్తారు.
పూజల అనంతరం సేవాకర్తలకు పోస్టు ద్వారా ప్రసాదం పంపిస్తారు.
ఈ పరోక్షసేవ గురించి మరిన్ని వివరాలను దేవస్థానం కాల్ సెంటర్ ద్వారా (ఫోన్ నెం: 83339 01351/ 52/53/54/55/56) ద్వారా పొందవచ్చు.
22 నుండి గణపతి నవరాత్రులు:
వినాయకచవితిని పురస్కరించుకుని ఆగస్టు 22వ తేదీ (భాద్రపద శుద్ధ చవితి) నుండి 31.08.2020 (భాద్రపద శుద్ధ త్రయోదశి)వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల సమయంలో ఆలయప్రాంగణంలోని రత్నగర్భగణపతిస్వామి వారికి , శ్రీశైలం సమీపంలోని సాక్షిగణపతి స్వామివారికి, యాగశాలలో వేంచేపు చేయించిన గణపతిస్వామివారి పంచలోహమూర్తికి ప్రతినిత్యం వ్రతకల్పవిశేషార్చనలు నిర్వహిస్తారు.
అదేవిధంగా శ్రీ సాక్షిగణపతి ఆలయం వద్ద మృత్తికా గణపతిని (మట్టితో చేసిన వినాయకుని విగ్రహాన్ని) కూడా నెలకొల్పి ఉత్సవ సమయంలో ప్రతీరోజు వ్రతకల్పపూర్వకంగా పూజాదికాలను జరుపుతారు.
ఈ ఉత్సవాలకు ప్రారంభ సూచికంగా 22 తేదీన (వినాయకచవితి రోజున) ఉదయం గం.8.00గంటలకు యాగశాల ప్రవేశము, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, స్వస్తిపుణ్యహవచనం, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణధారణ, శ్రీ వరసిద్ధి వినాయకవ్రతం కార్యక్రమాలు చేస్తారు.
ఈ పూజల తరువాత యాగశాలలో అఖండస్థాపన, మండపారాధన, కలశస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం వినాయకునికి వ్రతకల్పపూర్వకంగా పూజాదికాలు జరుపుతారు.
ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, ఉపాంగహవనాలు, గణపతిహోమం చేస్తారు.
ఉత్సవాలలో భాగంగానే ఆగష్టు 23 తేది నుండి 30వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం నుండి వ్రతకల్పపూర్వకంగా గణపతిపూజ, మండపారాధనలు, కలశార్చనలు, ఉపనిషత్పరాయణలు, జపానుష్టానాలు, గణపతిహోమం చేస్తారు.
ఉత్సవాల చివరిరోజైన ఆగష్టు 31వ తేదీన ఉదయం . గం. 7.30ల నుండి గణపతిపూజ, మండపారాధనలు, కలశార్చనలు, గణపతి హోమం జరిపించిన అనంతరం పూర్ణాహుతి చేస్తారు. ఈ పూర్ణాహుతితో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగుస్తాయి.
కోవిడ్ నియంత్రణ నిబంధనల మేరకు సంబంధిత అధికారులు, అర్చకులు,వేదపండితులు తగు జాగ్రత్తలతో భౌతికదూరాన్ని పాటిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తారు.
హుండీల లెక్కింపు :
ఈ రోజు 20 న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ. 1,23,98,845/-లు నగదు రాబడిగా లభించింది.
కాగా గతములో మార్చి 19వ తేదీన హుండీలలెక్కింపు చేసారు. మార్చి తరువాత ఈ రోజే (20.08.2020) హుండీల లెక్కింపు చేపట్టారు.
కాగా కరోనా నివారణ చర్యలలో భాగంగా మార్చి 19 నుండి జూన్ 7వ తేదీ వరకు దర్శనాలు నిలుపుదల చేసారు. తరువాత జూన్ 8 మరియు 9వ తేదీలలో ప్రయోగాత్మక పరిశీలనగా దేవస్థానం సిబ్బందిని, స్థానికులను అనుమతించారు.
అదేవిధంగా జూన్ 10వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు భక్తులను దర్శనానికి అనుమతించారు.
తిరిగి జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీవరకు దర్శనాలు నిలుపుదల చేసారు. ఆగస్టు 14వ తేదీ నుండి దర్శనాలను తిరిగి ప్రారంభిన్చారు.
కాగా ఈ రోజు జరిగిన హుండీ లెక్కింపులో 242 గ్రాముల బంగారు, 4 కేజీల 950 గ్రాముల వెండి కూడా లభించింది.
సౌండ్ అండ్ లైట్ షో పనుల పరిశీలన:
దేవస్థానములో కొనసాగుతున్న సౌండ్ అండ్ లైట్ షో పనులను నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైల శాసన సభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డి ఈ రోజు పరిశీలించారు.
భారత ప్రభుత్వంవారి ప్రసాద్ (PRASAD-Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive) పథకం కింద ఈ సౌండ్ అండ్ లైట్ షో పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి పార్లమెంట్ సభ్యులకు,
శాసనసభ్యులకు పనుల ప్రగతిని గురించి వివరించారు.
ఆలయ ప్రాంగణములో వాయువ్యభాగాన (నాగులకట్ట వెనుకభాగములో) ఈ సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేసారు.
సుమారు 40 నిమిషాల నిడివిగల ఈ ప్రదర్శనలో జ్యోతిర్లింగ క్షేత్రాల పరిచయం, అష్టాదశ శక్తిపీఠాల పరిచయం, శ్రీశైలక్ష ప్రాశస్త్యం, శిలాద మహర్షి కుమారుడైన పర్వతుడు తపస్సుతో శివుని మెప్పించి పర్వత అకారాన్ని పొంది శ్రీపర్వతంగా మారడం, శ్రీపర్వతంపై పరమేశ్వరుడు శ్రీపర్వతస్వామిగా స్వయంగా కొలువుదీరడం, కాలక్రమములో శ్రీపర్వతం శ్రీశైలంగాను, శ్రీపర్వతస్వామి మల్లికార్జునస్వామిగా పిలువబడటం, ఆదిపరాశక్తి భ్రమర (తుమ్మెద) రూపాన్ని ధరించి అరుణాసురుడిని సంహరించి శ్రీశైలంలో భ్రమరాంబాదేవిగా అవతరించడం, చంద్రవతికథ, శ్రీశైలములో ఆదిశంకరుల వారు తపస్సు, అక్కమహదేవి వృత్తాంతం, శ్రీశైలములో అక్కమహాదేవి తపస్సు ఆచరించడం, కదళీవనములో సిద్దిపొందడం, శ్రీశైల చారిత్రక విశేషాలు మొదలైన అంశాలతో ఈ ప్రదర్శన రూపొన్ధిన్చారు.
ఆధ్యాత్మిక గ్రంథాల ఆవిష్కరణ:
ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం నూతనంగా ప్రచురించిన ‘శ్రీశైలస్తోత్రకదంబమ్’ , ‘శ్రీభ్రమరాంబామల్లికార్జున సపర్యా (పూజా) విధానమ్’ గ్రంథాలను ఈ రోజు నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైల
శాసన సభ్యులు శ్రీ శిల్పాచక్రపాణిరెడ్డి ఆవిష్కరించారు. అమ్మవారి ఆలయప్రాంగణములోని ఆశీర్వచనమండపములో ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమంజరిగింది.
వేదవ్యాసమహర్షి రచించిన స్కాందపురాణములోని 64 అధ్యాయాల శ్రీశైలఖండం శ్రీశైల మహాక్షేత్రానికి సంబంధించిన ఎన్నో అంశాలను తెలియచెబుతోంది.
భక్తులు పఠించేందుకు వీలుగా ఈ స్కాందపురాణములోని శ్రీశైలఖండములో పేర్కొన్న శ్రీస్వామిఅమ్మవార్ల స్తోత్రాలు, దేవీ భాగవతములో పేర్కొన్న భ్రమరాంబాస్తోత్రము, గర్గమహర్షి, దుర్వాసమహర్షి, ఆదిశంకరులవారు రచించిన భ్రమరాంబా అష్టకాలతో స్తోత్ర కదంబ గ్రంథం రూపొందించారు.
అదేవిధంగా శ్రీ మల్లికార్జునస్వామి సుప్రభాతాన్ని కూడా ఈ గ్రంథములో చేర్చారు.
ఇక భక్తులు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను సంప్రదాయబద్ధంగా అర్చించుకునేందుకు వీలుగా స్వామిఅమ్మవార్ల పూజావిధానాన్ని ప్రచురించారు.
శ్రీశైల ఖండములోని 30వ అధ్యాయములో శ్రీ అమ్మవారి పూజావిధానం,44వ అధ్యాయములో స్వామివారి పూజావిధానము ఉంది.
ప్రముఖ సంస్కృత పండితులు క్రిష్టి లక్ష్మీ సీతారామాంజనేయశర్మ, భీమవరం వారు ఈ గ్రంథాలను పరిష్కరించి, సంకలనం చేశారు. విశ్రాంత ఐ.ఏ.ఎస్ అధికారి మాట రామారావు శ్రీస్వామిఅమ్మవార్లసేవగా ఈ గ్రంథముద్రణకు ఆర్థిక సహకారాన్ని అందించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ శ్రీశైలక్షేత్ర ప్రాశస్త్యం, మహిమా విశేషాలు మొదలైన అంశాలను తెలియజేసే మరిన్ని ఆధ్యాత్మికగ్రంథాలను ప్రచురించి భక్తులకు అందుబాటులోకి తేవాలని సూచించారు.
ఈ రెండు గ్రంథాలలో ఒక్కో గ్రంథం వెల రూ. 30.00లుగా నిర్ణయించారు. దేవస్థాన ప్రచురణల విక్రయ కేంద్రం ద్వారా భక్తులు ఈ గ్రంథాన్ని కొనుగోలు చేయవచ్చు.
అదేవిధంగా కర్నూలు నగరములో గల దేవస్థాన సమాచార కేంద్రంలో కూడా ఈ గ్రంథాలను అందుబాటులో ఉంచారు. ఇంకా భక్తులు తపాలా ద్వారా కూడా ఈ గ్రంథాలను పొందే సదుపాయం కల్పించారు.
Post Comment