శ్రీశైల క్షేత్ర పరిధి విస్తరణకు అనుగుణంగా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు- జిల్లా ఎస్పీ

శ్రీశైల దేవస్థానం: జిల్లా ఎస్పీ  ఫక్కీరప్ప క్షేత్రపరిధిలో ఈ రోజు  దేవస్థానం కార్యనిర్వహణాధికారితో పర్యటించి భద్రతా చర్యలను పరిశీలించారు.

ఆత్మకూరు డీఎస్పీ  వెంకట్రావు, స్థానిక సీ.ఐ  రవీంద్ర, దేవస్థాన పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. –

ఈ పరిశీలనలో భాగంగా రథశాల కూడలి, ఆలయ మహాద్వారం, ఆలయప్రాంగణమ్, ఆలయములోని లడ్డూ ప్రసాదాల తయారీ కేంద్రం, కల్యాణమండప ప్రాంగణము, అమ్మవారి ఆలయం, ఆలయ పశ్చిమమాడవీధి మొదలైన వాటిని జిల్లా ఎప్పీ పరిశీలించారు. తరువాత దేవస్థాన సీసీ కంట్రోల్ రూమును,  పలుచోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కూడా వారు పరిశీలించారు.

 కార్యనిర్వహణాధికారి దేవస్థానములోని భద్రతా సిబ్బంది వివరాలు, భద్రతాపరంగా క్షేత్రపరిధిలో దేవస్థానం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వివరాలు, దేవస్థానం కంట్రోల్ రూమ్ నిర్వహణ, క్యూలైన్ నిర్వహణ, యాత్రికుల సామాన్లు భద్రపరిచేందుకు చేపట్టిన చర్యలు మొదలైన వాటిని వివరించారు.

ఈ పరిశీలన అనంతరం జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ భద్రతాపరంగా ప్రస్తుతం దేవస్థానం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. క్షేత్రపరిధి విస్తరిస్తున్నదని, విస్తరణకు అనుగుణంగా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను మెరుగుపర్చాలని సూచించారు.

 టోల్ గేట్ వద్ద తనిఖీలు, లగేజీస్కానర్ ఏర్పాటు, ఆలయప్రాంగణములోకి ప్రవేశించే సమయములో తనిఖీలు, భద్రతా సిబ్బందికి శిక్షణ, అగ్నిప్రమాదాలు సంభవించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైన అంశాల గురించి జిల్లా ఎస్పీ వివరించారు. రాబోవు 10సంవత్సరాలలో విస్తరించనున్న క్షేత్రపరిధిని, క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని భద్రతాపరంగా తీసుకోవలసిన చర్యల గురించి తగిన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

print

Post Comment

You May Have Missed