శ్రీశైల దేవస్థానం:ప్రజలు రోగాలకు గురికాకుండా, ఆరోగ్యంగా వుండేందుకు, ముఖ్యంగా కరోనా వైరస్ మొదలైన సూక్ష్మాంగ జీవులు వ్యాప్తి చెందకుండా నశించేందుకు నిర్వహించిన శీతలాదేవిహోమ పూర్ణాహుతి ఈ రోజు 20న సాయంత్రం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుండి ఈ విశేషహోమం జరిగింది. ఈ ఐదురోజులు కూడా శీతలా జపం, మహావిద్యాపారాయణలు, వేదసూక్త పారాయణలు చేసారు.దేవస్థానం వేదపండితులు ఈ జపపారాయణలను నిర్వహించారు.కాగా శీతలాదేవి హోమం, శీతలాజపాలవలన అమ్మవారు లోకాలను చల్లగా చూస్తారని నమ్మకం. ప్రస్తుత విపత్కర పరిస్థితులు తొలగిపోయి, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలనే సంకల్పముతో హోమము,జపపారాయణలను చేసారు.
మహామృత్యుంజయ మంత్రజపం:
లోకకల్యాణం కోసమై ముఖ్యంగా జనులకు హానికలిగించే కరోనా వంటి సూక్ష్మాంగ క్రిముల వ్యాప్తి నివారణ జరిగి , అందరూ ఆరోగ్యంగా వుండాలనే సంకల్పముతో ఈ రోజు నుంచి మహామృత్యుంజయ మంత్ర జపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
గత మార్చి – ఏప్రియల్ మాసాలలో కూడా 41 రోజులు ఈ మృత్యుంజయ మంత్రజపాలు చేసారు.కాగా ప్రస్తుతం ఆలయప్రాంగణములో అర్చకస్వాములు ఈ జపాలను నిర్వహిస్తున్నారు.అదేవిధంగా ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితులు తొలగేందుకు ఈ రోజు నుండి శ్రీమల్లికార్జునస్వామివారికి ప్రత్యేకంగా ఏకాదశ రుద్రాభిషేకం కూడా నిర్వహిస్తున్నారు.
పదకొండు మంది అర్చకస్వాములు ఏకకాలములో రుద్రమంత్రాలు పఠిస్తూ ఈ అభిషేకాలను నిర్వహిస్తున్నారు.
బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం:
లోక కల్యాణం కోసం అమావాస్యను పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు సాయంకాలం గం.5.30ల నుండి శ్రీశైలక్షేత్రపాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేష పూజలు జరిగాయి.ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను చేస్తారు.బయలువీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. పరమేశ్వరుని 25 లీలారూపాలలో ఒకరు. ఉగ్రరూపంలో దర్శనమిచ్చే ఈ స్వామి శరణు అని వచ్చిన భక్తులకు అభయప్రదుడై అనుగ్రహిస్తాడు.
శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్చాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట ముకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రిందివైపులో కుడివైపున దక్షుడు, ఎడమవైపున భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి.
ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్రపాలకుడు పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయ బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం , అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామిపూజతో సకల దోషాలు, దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం జరిగింది.
అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ బయలువీరభద్రస్వామివారికి విశేషార్చనలు చేసారు.