ఈ రోజు రాత్రి కోవిడ్ – 19 కేంద్ర బృంద ప్రతినిధులు డా. మధుమిత దూబే, డైరెక్టర్, ప్రొఫెసర్, ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైజిన్ అండ్ పబ్లిక్ హెల్త్, డా. సంజయ్ కుమార్ సాదూఖాన్, ప్రొఫెసర్, ఆలిండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ హైజిన్ అండ్ పబ్లిక్ హెల్త్ వారు శ్రీశైలానికి విచ్చేశారు. శ్రీశైల క్షేత్రములో కోవిడ్ నివారణకు తీసుకున్న చర్యలు , భవిష్యత్తులో భక్తులను దర్శనానికి అనుమతించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైన వాటిని గురించి పరిశీలించేందుకు ఈ కేంద్ర బృందం శ్రీశైలానికి విచ్చేశారు.ఈ రాత్రి భ్రమరాంబా అతిథిగృహానికి చేరుకున్న వీరికి కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు, ఆత్మకూరు డీఎస్పీ డి. వెంకట్రావ్, తహశీల్దార్ రాజేంద్రసింగు స్వాగతం పలికారు. తరువాత వీరు భ్రమరాంబా అతిథిగృహములో అధికారులతో సమావేశమయ్యారు.
శ్రీశైలదేవస్థానం పరిధిలో లాక్ డౌన్ ముందు, లాక్ డౌన్ ప్రకటించిన తరువాత కరోనా నివారణకు దేవస్థానం తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో భక్తులను అనుమతించేటప్పుడు దేవస్థానం తీసుకోనున్న ముందస్తు జాగ్రత్తలను గురించి కార్యనిర్వహణాధికారి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ విషయమై దేవస్థానం చేపట్టిన చర్యల పట్ల కేంద్ర బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది . బృంద సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో భక్తులను దర్శనాలకు అనుమతించేటప్పుడు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా క్యూలైన్లలో భక్తులు భౌతికదూరం పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు క్యూలైన్లలో ప్రవేశించేప్పుడు విధిగా చేతులు శుభ్రపరుచుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులందరు కూడా మాస్క్ లను ధరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.