శ్రీశైలదేవస్థానం:ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు 25 న శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు.ఈ రోజు వేకువజామున శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజాదికాలు, రావణవాహన సేవ ఆలయ ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం కారణంగా ఈ రోజు ఆలయవేళలలో మార్పులు చేసారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఈ విశేష కార్యక్రమాలు జరిపారు. రావణవాహనసేవ గ్రామోత్సవం నిర్వహించవలసివుండగా కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని కేవలం ఆలయ ఉత్సవం మాత్రమే జరిపారు.
ఈ రోజు ఉదయం గం.3.00లకు ఆలయ ద్వారాలను తెరచి మంగళ వాయిద్యాల అనంతరం గం.3.30ని!!లకు స్వామివారికి సుప్రభాతసేవ జరిపారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాలపూజలు జరిపించి గం.4.30ని!!లకు స్వామివారికి, తరువాత అమ్మవారికి మహామంగళ హారతులు ఇచ్చారు.మహామంగళహారతుల తరువాత స్వామివారి ఆలయ ముఖమండపములో అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవసంకల్పాన్ని పఠించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని,జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని సంకల్పం చేసారు.అనంతరం ఉత్సవపూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేసారు.తరువాత ఈ ఉత్సవంలో భాగంగానే శ్రీస్వామిఅమ్మవార్ల ముఖమండపములో ఉత్తరముఖంగా వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజ జరిపారు.
పూజాదికాల అనంతరం స్వామిఅమ్మవార్లను ముఖమండప ఉత్తర ద్వారం నుండి వెలుపలకు తోడ్కొని వచ్చి, బలిపీఠం వద్ద ఉత్తరముఖంగా ఆశీనులు చేసి రావణవాహనసేవ జరిపారు.
శ్రీ స్వామివారి ఆలయ ఉత్సవం ప్రారంభమైన తరువాత భక్తులను సర్వదర్శనానికి, ఆర్జిత సేవలకు అనుమతించారు.