శ్రీశైలం దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం: లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం  ఈ రోజు  ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద వేంచేబు చేసి ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.
ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరుపుతారు.ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను నిర్వహించారు. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు జరిపారు.
లోకోద్ధరణకోసమై బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు. శ్రీశైలక్షేత్రానికి దత్రాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు.
దత్తాత్రేయస్వామివారు కలియుగంలో గోదావరి తీరాన పీఠాపురంలో శ్రీపాదవల్లభునిగా జన్మించారు. వీరు ఒకసారి శ్రీశైలక్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురుచరిత్రలో ఉంది.శ్రీపాదవల్లభుడు తమ శిష్యులకు ఆయా తీర్థక్షేత్రాల మహిమావిశేషాలను పేర్కొనే సందర్భంలో కూడా శ్రీశైలాన్ని పలుసార్లు ప్రస్తావించారు.
శ్రీపాదవల్లభుల జన్మతరువాత మహారాష్ట్రలోని కరంజినగరములో నృసింహసరస్వతి స్వామిగా దత్తాత్రేయస్వామివారు జన్మించారు.వీరు ఒకసారి మహాశివరాత్రి రోజున శ్రీశైలమల్లికార్జునుని సేవించినట్లుగా కూడా గురుచరిత్ర చెబుతోంది.
నృసింహసరస్వతి వారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళగంగలోనే చేశారు.
కలియుగ ప్రభావం రోజు రోజుకు ఎక్కువ కావడముతో, నృసింహసరస్వతీస్వామి తాము యికమీదట అదృశ్యరూపములో ఉండి తన భక్తులను రక్షించాలని నిర్ణయించారు. దాంతో భౌతికదేహాన్ని త్యజించేందుకు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలానికి వచ్చారు.
శ్రీశైలంలోని కదళీవనం దగ్గర తమ శిష్యులు చూస్తుండగానే నృసింహసరస్వతిస్వామివారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనంపై కూర్చోని, కృష్ణానదిలో ప్రవేశించి, కొంతదూరం ఆ అరటి ఆకులపైనే పయనిస్తూ, అదృశ్యమైనట్లు గురుచరిత్ర చెబుతోంది. అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ శ్రీదత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను జరిపించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.