శ్రీశైల దేవస్థానం:రానున్న 20-25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రాభివృద్ధికి రూపొందించాల్సిన అభివృద్ధి ప్రణాళిక, చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఈ రోజు దేవస్థానం అధికారులు క్షేత్రంలో విస్తృతంగా పర్యటించారు.రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి శ్రీ ఎం.గిరిజాశంకర్ సూచనల మేరకు ఢిల్లీకి చెందిన మాస్టర్‌ప్లాన్ రూపకల్పన నిపుణులు విశాల్ కుంద్ర, సూర్యశ్రీనివాస్, ఏకామ్ సంస్థవారు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శిఖరేశ్వర ఆలయ ప్రదేశం, హాఠకేశ్వర ఆలయ ప్రదేశం, సాక్షిగణపతి ఆలయ ప్రాంతం, టోల్ గేట్ పరిసర ప్రాంతాలు, వలయరహదారి, టూరిస్ట్ బస్టాండ్, యజ్ఞవాటిక,గోశాల ప్రాంతం, డంపింగ్ యార్డు ప్రదేశం, ఆలయమాడవీధులు, ఆలయప్రాంగణం మొదలైన వాటిని పరిశీలించారు.
క్షేత్రపరిధిలో మరికొన్నిచోట్ల కుటీర నిర్మాణం పథకం కింద దాతల విరాళాలతో కాటేజీల నిర్మాణం, సామాన్య భక్తుల కోసం డార్మిటరీ వసతి నిర్మాణం, పలుచోట్ల విచారణ కార్యాలయాలు, భక్తులరద్దీకి అనుగుణంగా క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, అవసరమైనచోట్ల అంతర్గత రహదారుల విస్తరణ, పలు చోట్ల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, వీధిదీపాల ఏర్పాట్లు, సుందరీకరణలో భాగంగా క్షేత్రపరిధిలో మరిన్నిచోట్ల ఉద్యానవనాల ఏర్పాటు, పచ్చదనాన్ని పెంపొందించడం, ల్యాండ్ స్కేపింగ్ పనులు, సృజనాత్మకత విద్యుద్దీకరణ, ప్రదర్శనశాల (మ్యూజియం) ఏర్పాటు, మరిన్ని ఆర్జిత సేవాకౌంటర్ల ఏర్పాటు మొదలైన అంశాల గురించి నిపుణులతో చర్చించారు.
అదేవిధంగా క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకుగాను భవిష్యత్తులో ధ్యాన మందిరం నిర్మాణం, సాధుభవన్ ఏర్పాటు మొదలైన అంశాలు కూడా చర్చించారు.
ఈ పర్యటనకు ముందు దేవస్థానం కార్యాలయములో మాస్టర్ ప్లాన్ రూపకల్పన నిపుణులతో దేవస్థానం అధికారులు సమావేశమై అభివృద్ధి ప్రణాళికపై కూలంకుషంగా చర్చించారు.ఈ పరిశీలన ఆధారంగా ఏకామ్ సంస్థవారు ఆయా అంశాలను గురించి ఉన్నతాధికారులతో చర్చించి అభివృద్ధి ప్రణాళికను రూపొందించి అందజేయనున్నారు. ఈ పర్యటనలో కార్యనిర్వహణాధికారితో పాటు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
| రాష్ట్ర బయోడైవర్సిటీ సభ్యకార్యదర్శివారితో సమావేశం:
శ్రీశైలక్షేత్ర పరిధిలో పర్యావరణ పరిరక్షణ, క్షేత్ర సుందరీకరణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు సభ్యకార్యదర్శి డా. డి. నళినీమోహన్తో దేవస్థానం అధికారులు ఈ రోజు (03.11.2020) సమావేశమయ్యారు.
దేవస్థానం కార్యాలయములో సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ముందుగా దేవస్థానం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం, శ్రీశైల మహాక్షేత్రమంలో నిర్వహిస్తున్న ఉద్యానవనాలు, దేవస్థానం నిర్వహిస్తున్న నర్సరీ మొదలైన వాటి గురించి కార్యనిర్వహణాధికారి వివరించారు.
ముఖ్యంగా వలయ రహదారికి ఇరువైపులా నాటుతున్న మొక్కల వివరాలు, క్షేత్రపరిధిలోని ఆరుబయలు ప్రదేశాలలో పెంచనున్న మొక్కలు, ప్రస్తుతం దేవస్థానం ఏర్పాటు చేస్తున్న నక్షత్రవనం మొదలైనవాటి గురించి కార్యనిర్వహణాధికారి వివరించారు.
బయోడైవర్సిటీబోర్డు సభ్యకార్యదర్శి పలు సూచనలను, సలహాలను అందజేశారు. వలయ రహదారిలో నాటేందుకు అనువైన మొక్కలు, వాటి పరిరక్షణ, ఆరుబయలు ప్రదేశాలలో పెంచాల్సిన మొక్కలు, ఉద్యానవనాలలో ల్యాండ్ స్కేపింగ్ పద్ధతులు, వీటికి సంబంధించిన సాంకేతిక విధానాలు మొదలైన వాటి గురించి వారు వివరించారు. అదేవిధంగా క్షేత్రంలో పలుచోట్ల ఔషధ మొక్కలను పెంచాలని కూడా సూచించారు.
ముఖ్యంగా దేవస్థానములో నర్సరీ నిర్వహణ కార్యక్రమాలను మరింత విస్తరింపజేసి అరుదైన పుష్పజాతులను, సుందరీకరణ మొక్కలను పెంచాలని కూడా సూచించడం జరిగింది. క్షేత్రపరిధిలో పర్యావరణ అవగాహన కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు.