తిరుమల, నవంబరు 27: కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శుక్రవారం తిరుమల వసంత మండపంలో శ్రీ రాధా దామోదర పూజ ఘనంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ రాధాకృష్ణుల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు మాట్లాడుతూ రాధ, కృష్ణుడు(దామోదరుడు) సకలసృష్టికి మూలకారకులని చెప్పారు. ప్రకృతి స్త్రీ స్వరూపమని, సమస్త జీవరాశులు క్షేమంగా ఉండేందుకు రాధా దామోదర పూజను టిటిడి నిర్వహించిందని వివరించారు. స్వామి, అమ్మవారి అనుగ్రహంతో వ్యాధిబాధలు తొలగుతాయన్నారు.
ముందుగా కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి ప్రార్థనా సూక్తం, విష్ణుపూజా మంత్ర పఠనం చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ రాధాకృష్ణులకు తిరువారాధన చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు ఎన్ఎకె.సుందరవదనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం జరిగింది. తిరుమలలో వర్షం, ఈదురుగాలుల కారణంగా మాడ వీధుల్లో ఊరేగింపును టిటిడి రద్దు చేసింది. ఉదయం 4.45 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆలయంలో ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆనంతరం స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రాశస్త్యం..
పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాళ్ కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది.
నంబదువాన్ కథ…
కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, బోర్డు సభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి, గోవిందహరి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.టి.టి.డి ప్రజాసంబంధాల అధికారి సౌజన్యం.