వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతినకుండా వ్యవహరించాలి-డీ.జీ.పీ ఆదేశం

రాష్ట్రం లో పోలీసు అధికారులు, సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తూ మానవీయ కోణంలో విధులు నిర్వర్తించాలని డీ.జీ.పీ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశించారు. పఠాన్ చెరు లో బుధవారం కానిస్టేబుల్ చేసిన అనుచిత ప్రవర్తన నేపథ్యం లో పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, ట్రైనింగ్ కళాశాలలు, పోలీస్ బెటాలియన్లు,  ఎస్.పీ లు, ఇతర యూనిట్ అధికారులు,  ఎస్.హెచ్.ఓ, కానిస్టేబుల్, హోమ్ గార్డ్ అధికారులతో కలసి  ఒకే సారి వేయి కార్యాలయాలతో అనుసంధానమై నేడు సాయంత్రం దాదాపు మూడు గంటలపాటు  డీ.జీ.పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడిషనల్ డీ.జీ లు అభిలాష బిస్త్,  సందీప్ శాండిల్య,  ఐ.జీ స్టీఫెన్ రవీంద్ర, డీ.ఐ.జీ శివశంకర్ రెడ్డి తదితరులు డీజీపీ కార్యాలయం నుండి  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రామగుండం నుండి అడిషనల్ డీజీ జితేందర్ పాల్గొన్నారు.  డీ.జీ.పీ. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణా పోలీస్ శాఖ ఎన్నోవిప్లవాత్మక మార్పులు తేవడం ద్వారా పోలీసింగ్ లో  ఇతర రాష్ట్రాలకు ఆదర్శం గా నిలిచిందని గుర్తుచేశారు. అయితే, పఠాన్ చెరు లో జరిగిన దురదృష్ట సంఘటనల వల్ల మొత్తం పోలీస్ శాఖ అప్రతిష్ట పాలు అయ్యే అవకాశం ఏర్పడిందని అన్నారు. నైతిక విలువలు, మానవీయత తదితర అంశాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి నిరంతరం పునశ్చరణ నిర్వహించాలని సూచించారు. ఇలాంటి  దురదృష్టకర సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉన్నతాధికారి నుండి కానిస్టేబుల్,  హోమ్ గార్డు వరకు బాధ్యతాయుతంగా  వ్యవహరించాలని సూచించారు.  విధి నిర్వహణ లో ప్రతీ పోలీస్ అధికారి ప్రజలే తమ యజమానులనీ,  తాము ప్రజల సేవకులమనే మౌలిక విషయాన్ని నిరంతరం పరిగణలో తీసుకోవాలని అన్నారు. చట్ట ప్రకారం, సమాజం హర్షించే విధంగా, ప్రజామోదం పొందే విధంగా పనిచేస్తూ తమ విధి నిర్వహణలో లక్ష్యాలను సాధించాలని డీజీపీ పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా మన పోలీస్ శాఖకు కలిగిన గౌరవం కేవలం ఒకరిద్దరు అధికారులు చేసే ఇలాంటి దురదృష్ట సంఘటనలవల్ల పోలీస్ శాఖ లో పనిచేసే వేలాది మంది పోలీస్ అధికారుల నిరంతర శ్రమ వృధా కాకుండా చూడాల్సి  ఉందని అన్నారు. పోలీసింగ్ పై ప్రజలనుండి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ స్వీకరించాలని, ఇందుకు గాను పోలీస్ స్టేషన్ల వారీగా  యువకులు, రైతులు, కార్మికులు,సీనియర్ సిటిజన్లు, ఉపాధ్యాయులు,మహిళలు, విద్యార్థినీ, విద్యార్థులతో కూడిన ప్రత్యేక ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు. పోలీస్ శాఖ పనితీరును సమాజం మొత్తం సునిశితంగా పరిశీలిస్తోందని , ఈ నేపథ్యం లో  శాఖ లోని ఉన్నత స్థాయి అధికారినుండి కానిస్టేబుల్, హోమ్ గార్డ్ అధికారివరకు వరకు స్వీయ క్రమశిక్షణతో  ప్రవర్తించాలని తెలియ చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు, వ్యక్తి ఆత్మ గౌరవం  దెబ్బతినే  విధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవర్తించ వద్దని ఆదేశించారు. ఈ విషయమై పోలీస్ శాఖ ఏవిధమైన చర్యలు తీసుకోవాలన్న  అంశంపై పోలీస్ కానిస్టేబుల్ నుండి అడిషనల్ డీజీ స్థాయి వరకు అధికారులు తమ అభిప్రాయాలను ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు. నేడు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన మేధో మధనంలో వచ్చిన సలహాలు, సూచనలను అమలుకు ఫోకస్ గ్రూప్ లతో సంప్రదించి తగు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఈ వీడియో కాన్ఫరెన్స్లో  నిర్ణయించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.