వైభవంగా తిరుప్పావై గోష్ఠి గానం
వేంకటేశ్వరస్వామి ఆలయం, జిల్లెలగూడ (జనవరి 5,2019)*
పవిత్ర ధనుర్మాసాన్నిపురస్కరించుకుని ఆండాళ్ తల్లి అందించిన దివ్య ప్రబంధం తిరుప్పావై గోష్ఠి, గాన కార్యక్రమం జనవరి 5వ తేదీ శనివారం జిల్లెలగూడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో జరిగింది. ఉ.వే. శ్రీ డింగరి రామాచార్యుల ఆధ్వర్యంలో, శ్రీమతి వి. సువర్ణ కుమారి సారథ్యంలో తిరుప్పావై పాశురాలను భక్తి శ్రద్ధలతో ఒక పాశురాన్ని ఒకరు చొప్పున 28 మంది చక్కగా, అర్థవంతంగా గానం చేసారు.
ఆళ్వార్ అంటే మునుల వంటి వారని, భగవత్ తత్వాన్ని బాగా తెలిసిన వారని అర్థం. భగవంతుడే తనకు ప్రీతిపాత్రులుగా అనుగ్రహించి తయారు చేసుకున్న భక్తులను ‘దివ్యసూరు’లని ‘ఆళ్వార్’ అని మనం కీరిస్తున్నాం. పన్నెండు మంది ఆళ్వారులలో ‘ఆండాళ్’ (గోదాదేవి) ఒకరు.
ఆళ్వార్ అనే తమిళ పదానికి అర్థం భగవదనుభవంలో మునిగి తేలినవారు. భగవత్ కటాక్షముతో పరిపూర్ణితని, పక్వ స్థితిని పొందిన విష్ణుభక్తులు.
శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తులకు తులసివనంలో లభించిన కుమార్తె ‘ఆండాళ్’ (గోదాదేవి). ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు. తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి “తిరుప్పావు” వ్రతాచరణ చేస్తారు. రోజు కొక పాశురముతో మార్గశీర్షస్నాన వ్రతము (ధనుర్ మాస వ్రతం). ఈ మాసమంతా ఆచరిస్తుంది.. శ్రీ రంగనాథునే వరించి ఆస్వామినే వివాహమాడి ఆయనలో ఐక్యమైపోతుంది.
ఆండాళ్ (గోదాదేవి) రోజుకొక పాశురముతో “తిరుప్పావై” అనే ద్రావిడ దివ్యప్రబంధమును మధురంగా పాడి సమర్పించింది. గోదాదేవి తన దివ్యప్రబంధమైన తిరుప్పావైలో ప్రతీ పాశురంలో నారాయణ తత్వాన్ని ప్రస్ఫుటీకరించింది. శ్రీకృష్ణ్ణునిపైగల ప్రపత్తిని చూపిస్తుంది. అంకితభావాన్ని తన పాశురంలలో తెలుపుతోంది. తాను తరించడమేకాక తన తోటి గోపికలనుకూడా మేల్కొల్పుతూ వారిని కూడా తరింపజేయడానికి పూనుకుంటుంది. లోక కల్యాణ హితమే ఈ పాశురాలలో కనబడుతోంది. శ్రీకృష్ణ్ణుని మనందరం కలసి ఆశ్రయించి తరిద్దాం రండి అని ప్రతిరోజూ ఒక్కో గోపికను నిద్రలేపుతుంది. భగవంతుని దర్శించేందుకు కొన్ని నియమాలు పాటిస్తారు. అలాంటి వ్రత నియమాలను తెలుపుతూ తరిద్దాం రండి అంటూ గోపికలతోపాటు భక్తులందరిని పిలుస్తుంది ఆండాళ్.వ్రతాచరణ సమయం ధనుర్మాసం లో ప్రతిరోజూ ఆలయంలో పాశురం చొప్పున పఠిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో శ్రీ భూనీలా సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, వికాసతరంగిణి మీర్ పేట సౌజన్యంతో, శ్రీమతి వి. సువర్ణకుమారి సమర్పణలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీమతి ఈ. శశిరేఖ, ధార్మికోపన్యాసకురాలు, కర్పూరం గోపిధర్, దార్మికవేత్త, వింజమూరి విజయకుమార్ చార్యులు, వంశీకృష్ణ, అధ్యక్షులు, వికాస తరంగిణి, మీర్ పేట, హైదరాబాద్, జి. హరినాథ్, సమన్వయాధికారి, టి.టి.డి, హిందూధర్మ ప్రచార పరిషత్ తదితరులు పాల్గొని పాశురాల గాయకులను సత్కరించారు.
తిరుప్పావై పాశురాలు రూపంలో తయారుచేయించిన చిత్రమాలిక జ్ఞాపికను తిరుప్పావై గోష్ఠి గానం చేసిన వారందరికీ కండువాతో సత్కరించి అందించారు . జ్ఞాపికలను కర్పూరం గోపిధర్, దార్మికవేత్త, కె. గోపిధర్ శ్యంప్రియ దంపతులు అందచేశారు. కార్యక్రమానికి ముందు వేదపాఠశాల విద్యార్థులచే వేదపఠనం, విష్ణు సహస్రనామాలు పారాయణం జరిగింది. వేదపాఠశాల విద్యార్థుల వేదపఠనం, విష్ణు సహస్రనామాలు పారాయణం ఆకట్టుకున్నాయి . హయగ్రీవ వేదపాఠశాల గురువు శ్రీమాన్ నందగోపాల్ గారిని కర్పూరం గోపిధర్ రూ.10,116 నగదును అందచేసి సత్కరించారు.
కె.ఎల్. నరసింహా రావు, జర్నలిస్ట్, కళావైభవం.కామ్ (సాంస్కృతిక సమాచార వెబ్ సైట్) వ్యవస్థాపకులు సమన్వయ, ప్రచార కర్తగా వ్యవహరించారు.
గోష్టిగానంలో పాల్గొన్నవారు:- శ్రీమతి ఎం. జయలక్ష్మి, శ్రీమతి పి. రాధాదేవి, శ్రీమతి కె. ఉమాదేవి, శ్రీమతి ఏ. వాణి, శ్రీమతి బి. రూపాదేవి, శ్రీ రాఘవాచార్యులు, శ్రీమతి డి. కృష్ణవేణి, శ్రీమతి జి. ఉమ, శ్రీమతి వి. సువర్ణకుమారి, శ్రీమతి టి.టి. వత్సల, శ్రీమతి కె. రాధ, చి. శ్రీమాన్, శ్రీమతి కె. వసంత, శ్రీమతి బి. కరుణ, శ్రీమతి శ్రీలత, శ్రీ కె. గోపిధార్, శ్రీమతి కె. గోపిధర్ శ్యంప్రియ, శ్రీమతి ఎం. కామేశ్వరి, శ్రీమతి బి. ఉష, శ్రీ టి. వంశీకృష్ణ, శ్రీమతి టి. భాను, శ్రీమతి వై.ఎన్. పాకజాలక్ష్మి, శ్రీ వై.ఎన్. నరసింహాచార్యులు, శ్రీమతి లీలావతి, శ్రీ రాజేందర్, శ్రీమతి కె. అరవింద భార్గవి, శ్రీమతి అరుణ. శ్రీ డి. రామాచారి మొదలైనవారు.
Post Comment