వైద్య‌, ఆరోగ్య రంగంలో తెలంగాణ కృషి అమోఘం ః ర‌త‌న్ టాటా

ఆరోగ్య రంగంలో మ‌రో ముంద‌డుగు,

తెలంగాణ ప్ర‌భుత్వంతో టాటా ట్ర‌స్ట్ స‌మ‌గ్ర క్యాన్స‌ర్ మేనేజ్‌మెంట్ ఒప్పందం,

టాటా గ్రూప్‌తో పెన‌వేసుకున్న తెలంగాణ అనుబంధంః మంత్రి కేటీఆర్,

ఆరోగ్య తెలంగాణ దిశ‌గా అనేక కార్య‌క్ర‌మాల అమ‌లు ః మంత్రి ల‌క్ష్మారెడ్డి,

హైద‌రాబాద్ ః వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు వేసింది. కాంప్రహెన్సివ్‌ కాన్సర్ కేర్ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం కింద టాటా ట్రస్ట్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్ప‌టికే వైద్య ఆరోగ్య రంగంలో దేశ వ్యాప్తంగా విశేష కృషి చేస్తున్న‌టాటా ట్ర‌స్ట్ ఈ ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రానికి క్యాన్స‌ర్ మేనేజ్‌మెంట్ విష‌యంలో సాధ్య‌మైన సాయం అందించ‌నుంది.  హైదరాబాద్ శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఐటీ, పురపాల‌క అభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్‌, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి, టాటా గ్రూప్ చైర్మ‌న్ ర‌త‌న్ టాటాల స‌మ‌క్షంలో వైద్య ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి, టాటా ట్ర‌స్ట్ ప్ర‌తినిధి వెంక‌ట్‌లు ఒప్పంద పత్రాల మీద సంత‌కాలు చేశారు. అనంత‌రం వాటిని ప‌ర‌స్ప‌రం ఇచ్చి పుచ్చుకున్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, టాటా గ్రూప్ తో తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో టాటా గ్రూప్ సేవలు అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి టాటా గ్రూప్‌ ఇస్తున్న మద్దతు మరవలేనిదన్నారు. టీ హ‌బ్‌ని ర‌త‌న్ టాటా 15 న‌వంబ‌ర్‌, 2015న ప్రారంభించార‌ని చెప్పారు. 200 గ్రూపుల‌తో మొద‌లైన టీ హ‌బ్ ఇప్పుడు 2వేల స్టార్ట‌ప్ కంపెనీల‌కు చేరింద‌ని, ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఇన్‌క్యుబేటర్‌ హబ్‌గా నిలుస్తోంద‌న్నారు. ఈ రోజే యుద్ధ విమాన క‌ర్మాగారం టాటా ఎయిర్ బోయింగ్ కేంద్రాన్ని ప్రారంభించార‌న్నారు. హెలికాప్టర్‌ విడిభాగాలు ఇక్కడ తయారుకావడం గొప్ప విషయం. జంషెడ్‌పూర్‌ తర్వాత టాటా ప్రధాన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

 

ఇక ప్రభుత్వ ద‌వాఖానాల్లో గుండె, కాలేయం మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. 40 డ‌యాల‌సిస్ కేంద్రాలు, 20 ఐసియూలు, 10 పిల్ల‌ల ఐసీయూలు, ప్ర‌తిష్టాత్మ‌కంగా కెసిఆర్ కిట్ వంటి ప‌థ‌కాలెన్నో ప్రారంభించామ‌న్నారు. ఐఎంఆర్ 38శాతం నుంచి 31శాతానికి త‌గ్గింద‌న్నారు. 31శాతంగా ఉన్న ప్ర‌స‌వాలు కెసిఆర్ కిట్ల ప‌థ‌కం అమ‌లు త‌ర్వాత 50శాతానికి పెరిగాయ‌న్నారు. ఆప‌రేష‌న్లు లేని ప్ర‌స‌వాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఉచిత వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని, ఉచిత కంటి ప‌రీక్ష‌లు చేయ‌బో్తున్నామ‌ని, ఫ‌ర్టిలిటీ కేంద్రం దేశంలో మొద‌టి సారిగా రాష్ట్రంలోని గాంధీ ద‌వాఖానాలో పెట్టామ‌ని వివ‌రించారు.

 

కెసిఆర్ ప్ర‌భుత్వం ఆరోగ్యానికి మేలు చేసే అనేక ప‌థ‌కాల‌ను ప్రారంభించింద‌న్నారు. మంచి నీటిని అందిస్తున్న‌ద‌ని కెటిఆర్ చెప్పారు. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా 53వేల కోట్ల‌తో 1500 కి.మీ. మేర పైపులైన్ వేశామ‌న్నారు. కోటి ఇండ్ల‌కు ఇంటింటికీ న‌ల్లా ద్వారా నీటిని అందిస్తున్నామ‌న్నారు. 24 గంట‌ల‌పాటు విద్యుత్‌, ఇంటింటికీ వైఫై సేవ‌లు ఇలా అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు మంత్రి కెటిఆర్ వివ‌రించారు. కేన్సర్ కేర్ కు సంబంధించి దేశంలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. ప్ర‌స్తుత ఒప్పందం వ‌ల్ల క్యాన్స‌ర్ నివార‌ణ‌కు మ‌రింత సులువు అవుతుంద‌న్న ఆశాభావాన్ని మంత్రి కెటిఆర్ వ్య‌క్తం చేశారు.

 

ఆరోగ్య తెలంగాణ దిశ‌గా అనేక కార్య‌క్ర‌మాల అమ‌లు ః మంత్రి ల‌క్ష్మారెడ్డి

 

వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వైద్య రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చి నట్లు తెలిపారు.ఇప్పటివరకు రాష్ట్రంలో 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్‌ కిట్లతో ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదరణ పెరిగిందన్న కేటీఆర్.. గర్భిణీలు డెలీవరికి ప్రభుత్వ ఆస్పత్రులకే వస్తున్నట్లు చెప్పారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన అనేక ప‌థ‌కాల‌ను ఒక్కొక్క‌టిగా వివ‌రించారు. క్యాన్స‌ర్ స్క్రీనింగ్‌ని చేప‌ట్టామ‌ని, గ్రామీణ ప్రాంత మ‌హిళ‌ల్లో బ్రెస్ట్ క్యాన్స‌ర్‌ని గుర్తించి, నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఎంఎన్‌జె హాస్పిట‌ల్ క్యాన్స‌ర్ నివార‌ణ‌కు కృషి చేస్తున్న‌ద‌న్నారు. టాటా ట్ర‌స్ట్ ఒప్పందంతో నాలుగు మెడిక‌ల్ కాలేజీలు, మూడు జిల్లాల్లోని వైద్య‌శాల‌ల‌కు క్యాన్స‌ర్ వ్యాధి నిర్ధార‌ణ‌, డిజిట‌లైజేష‌న్‌, వ్యాధి నివార‌ణ చికిత్స‌, శ‌స్త్ర చికిత్స అవ‌కాశాలు వ‌స్తాయ‌న్నారు. ఆరోగ్య తెలంగాణ ల‌క్ష్యంగా కెసిఆర్ నేతృత్వంలో తామంతా ప‌ని చేస్తున్నామ‌ని చెప్పారు.టాటా గ్రూపుతో తెలంగాణ ప్ర‌భుత్వ వైద్య ఆరోగ్య‌శాఖ చేసుకున్న ఒప్పందం వ‌ల్ల ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. టాటా ట్ర‌స్ట్‌ని మంత్రి అభినందించారు.

 

వైద్య‌, ఆరోగ్య రంగంలో తెలంగాణ కృషి అమోఘం ః ర‌త‌న్ టాటా

 

హైద‌రాబాద్‌కి రావ‌డానికి రెండు కార‌ణాలున్నాయి. ఒక‌టి కెటి రామారావు సృజ‌నాత్మ‌క ఆలోచ‌న‌లు, రెండోది ఆరోగ్య రంగంలో తెలంగాణ చేస్తున్న కృషి. తెలంగాణ‌తో ఎంఓయు చేసుకోవ‌డం ప‌ట్ల టాటా ట్ర‌స్ట్ గ‌ర్వ‌ప‌డుతున్న‌ది. దేశ భ‌విష్య‌త్తు శారీర‌కంగా, మేధ‌స్సు ప‌రంగా ఆరోగ్య‌వంత‌మైన ప్ర‌జ‌లు, స‌మాజంతోనే ముడి ప‌డి ఉన్న‌ది. ఇలాంటి ఒప్పందం వ‌ల్ల ప్ర‌జ‌ల‌ను తీవ్ర అనారోగ్యాల నుంచి కాపాడ‌వ‌చ్చు. ఈ విధంగా ప్ర‌పంచంలో మంచి ఆరోగ్య వంత‌మైన దేశంగా తీర్చిదిద్ద‌వ‌చ్చు. అందుకు టాటా ట్ర‌స్ట్ తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేయ‌డానికి సిద్ధంగా ఉంది. క్యాన్స‌ర్ లాంటి వ్యాధుల‌కు పేద‌, ధ‌నిక బేధాలు లేవు. ఎవ‌రికైనా రావ‌చ్చు. క్యాన్స‌ర్‌ని ముందుగా గుర్తించి వైద్యం చేస్తేనే న‌య‌మ‌వుతాయి. స‌రైన మంచి వైద్యం అందితే స‌మ‌స్య స‌మ‌సిపోతుంది. ఆరోగ్య వంత‌మైన స‌మాజ నిర్మాణం కోసం టాటా ట‌స్ట్ ప‌ని చేస్తున్న‌ది. అలాగే తెలంగాణ కూడా ప‌ని చేస్తున్న‌ది. తెలంగాణ‌తో ఆరోగ్య రంగంలో మ‌రింత కృషి, ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశం ల‌భించినందుకు సంతోషంగా ఉంది.

 

ఈ కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి వైద్య ఆరోగ్య‌శాఖ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల మీద ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌గా, టాటా ట్ర‌స్ట్ ప్ర‌తినిధులు ట్ర‌స్ట్ సేవ‌ల మీద ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, తెలంగాణ కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్‌, ఎన్ఎచ్ఎం డైరెక్ట‌ర్ వాకాటి క‌రుణ‌, చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ గ‌డ‌ల శ్రీ‌నివాసరావు, ట్ర‌స్ట్ ప్ర‌తినిధులు వెంక‌ట్‌, శ్రీ‌నివాస్‌, డాక్ట‌ర్ శ‌ర్మ‌, ల‌క్ష్మ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.