వైదిక సంప్రదాయ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేయూత నిస్తోందని శ్రీ చిన జీయర్ స్వామి వారు ప్రశంసించారు.శ్రీ వైష్ణవ సేవా సంఘం ,తెలంగాణ ,ఎస్ వి ఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ లలితకళా తోరణం లో జరిగిన శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగం , డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీ చిన జీయర్ స్వామి పాల్గొన్నారు. శ్రీ స్వామి వారు పంచాంగం , డైరీ ని ఆవిష్కరించారు. వేద పండితులను సన్మానించారు. ఈ సందర్భంగా కె. రామాచారి బృందం భక్తి సంగీత విభావరి ,శ్రీమతి మాధవీ రామానుజం బృందం వారు సమర్పించిన ఆచార్య త్రయం నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణ గా జరిగాయి. కార్యక్రమ నిర్వాహకులను శ్రీ స్వామి వారు ప్రశంసించారు. వికారి అంటే మార్పు అని ఈ ఉగాది మరింత మంచి మార్పు తేవాలని శ్రీ స్వామి వారు మంగళాశాసనం చేసారు. శ్రీవైష్ణవులు ప్రతి రోజు లౌకికంగా , ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న శ్రీవైష్ణవులు సంప్రదాయ ఉన్నతికి కూడా పాటుపడాలని కోరారు. యామునాచార్యులు, భగవత్ రామానుజాచార్యులు ,ఆళ్వారులు , గురు పరంపర అందించిన మూల గ్రంధాలను చదవాలని , అర్థ తాత్పర్యాలను తెలుసుకోవాలని , కొన్నైనా అనర్గళంగా చెప్పగలగాలని సూచించారు. శ్రీ వైష్ణవ సేవా సంఘం ,తెలంగాణ ,ఎస్ వి ఎస్ ట్రస్ట్ కేవలం కుల సంఘంగా మిగలకుండా సాంప్రదాయపరంగా నూతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. సంప్రదాయ ఉద్ధరణకు గురుకులాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇతర సంప్రదాయ పరులు చేస్తున్న కృషిని గమనించి మరిన్ని గొప్ప పనులు మనం కూడా ఆచరణలో తీసుకురావాలన్నారు.