Skip to content
కచ్చితమైన ప్రణాళిక, కాల వ్యవధి ( టైమ్ లైన్) తో హైదరాబాద్ చుట్టూ అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేయాలని, వీలైనంత త్వరగా హైదరాబాద్ చుట్టూ, ఏడు జిల్లాల్లో విస్తరించిన అటవీ పార్కులను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేస్తున్న వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఆయన అరణ్య భవన్ లో సమావేశమయ్యారు. శాఖల వారీగా జరిగిన అటవీ బ్లాక్ ల కేటాయింపు, అభివృద్ది పనుల పురోగతిని విడివిడిగా సమీక్షించారు. ఎట్టపరిస్థితుల్లోనూ పార్కుల అభివృద్ది, ప్రజలకు అందుబాటులోకి తేవటం ఆలస్యం జరగటానికి వీల్లేదన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగానే పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్నఅటవీ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ది జరుగుతోందన్నారు. అటవీశాఖ-15, హెచ్ఎండీఏ-17, టీఎస్ఐఐసీ 11, టూరిజం 7, ఫారెస్ట్ కార్పోరేషన్– 4, జీహెచ్ఎంసీ-3, మెట్రో రైల్ -2 మొత్తం 59 అర్బన్ ఫార్కుల అభివృద్దికి సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. పరిపాలనా అనుమతుల ప్రక్రియను తక్షణం పూర్తి చేసి పనులు చేపట్టాలని అజయ్ మిశ్రా ఆదేశించారు. పార్కులన్నీ కూడా అత్యంత సహజంగా, జీవ వైవిధ్యాన్ని కాపాడేలా పర్యావరణ హితంగా ఉండాలని సూచించారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతం వైపు వెళ్లినా అర్బన్ పార్కులు ఉండేలా ప్రణాళికలు ఉండాలన్నారు. దశల వారీగా అన్ని జిల్లాల్లోనూ అటవీ ప్రాంత పార్కుల అభివృద్ది జరుగుతుందన్నారు. ప్రతీ శాఖలోనూ ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని, అటవీ శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
సమావేశంలో పీసీసీఎఫ్ పీ.కే.ఝా, మెట్రో రైల్ ఎం.డి. ఎన్.వీ.ఎస్.రెడ్డి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, టూరిజం, టీఎస్ఎస్ఐఐసీ, అటవీ అభివృద్ది కార్పోరేషన్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.