- హైదరాబాద్, జూన్ 04 : పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులతో తరగతి గదులు కళకళలాడాయి. గ్రామాల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, అక్కడ కల్పిస్తున్న వసతులు వివరించి, విద్యార్థుల భవితకు ఉపాధ్యాయులు హామీనిచ్చి తల్లిదండ్రులకు ధీమా కల్పించే ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్నినేడు ఘనంగా ప్రారంభించారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల సర్కారు బడులలో వసతులు పెరగడమే కాకుండా ఫలితాలు కూడా ప్రైవేట్ పాఠశాలలను దాటిపోవడం సంతోషకరమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే పరిస్థితి మారి…నేడు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరతున్నారన్నారు. గతేడాది 50వేలకు పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలనుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాన్నారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురుకులాల్లో అడ్మిషన్లకు చాలా డిమాండ్ పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. అదేవిధంగా ఈ గురుకులాల్లో అందించే బోధన, భోజన వసతులు కూడా దేశంలో మరే రాష్ట్రంలో లేవన్నారు. ఈ సంవత్సరం కూడా మరింత ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత మెరుగైన విద్య అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.
తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకే అకాడమిక్ క్యాలెండర్ అమలు చేసి సిలబస్ పూర్తి చేయడం, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభను పదును పెట్టడం, పోటీ పరీక్షలకు అనువుగా వారిని తీర్చిదిద్దడం, ఇందుకోసం టీచర్లకు కూడా తగిన శిక్షణ కల్పించడం వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నత శ్రేణి విద్యనందించే విధంగా అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పన, కంప్యూటర్ పరిజ్ణానం అందించే విధంగా డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ తరగతలు, పర్యావరణంపై అవగాహన పెంచే స్వచ్ఛ్ స్కూల్, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచే ఆటలు- క్రీడలు, పోటీతత్వం పెంపొందించే పోటీపరీక్షలకు శిక్షణ, అంతర్జాతీయ విపణిలో వెనుకబడకుండా ఉండేందుకు ఆంగ్ల విద్యాబోధన, పరిశోధనపై పట్టును కల్పించే ల్యాబ్ వసతులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పాఠశాలలుగా మార్చాయన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి, వికాసానికి దోహదపడే మౌలిక వసతుల ఏర్పాటే కాకుండా, ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్స్, భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థినిలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్నామన్నారు. పరీక్షల సమయంలో అదనపు క్లాసులు నిర్వహించి పరీక్షలకు సన్నద్దం చేసే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వీటన్నింటిని మించి అత్యంత ప్రతిభావంతమైన, క్వాలిఫైడ్ టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ వసతులు వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలలను ప్రజల పాఠశాలలుగా మరింత అభివృద్ధి చేయడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు దేశానికి ఆదర్శ పాఠశాలలుగా మార్చడంలో సమిష్టి కృషి అవసరమన్నారు
