శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న వరుణ యాగం రెండో రోజుకు చేరింది. ఈ ఉదయం యాగవేదికపై నెలకొల్పిన ఆవాహన కలశాలకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిపారు. యజ్ఞ కుండాలలో హవిస్సు సమర్పించి యాగ కార్యక్రమాలు నిర్వహించారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం సుభిక్షంగా ఉండాలన్నఆకాంక్షతో శ్రీశైల దేవస్థానం లో నిన్న వరుణ యాగం ( కారీరీష్టి ) ప్రారంభమైంది. ఈ నెల రెండో తేదీ నుంచి ఆరో తేదీ వరకు వరుణ యాగం జరుగుతుంది. ఇందుకు ఏర్పాట్లను ఈ ఓ , ఇతర అధికారులు పర్యవేక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు బ్రహ్మశ్రీ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి శర్మ వారి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధులైన 55 మంది ఋత్వికులు ఇందులో పాల్గొంటున్నారు . ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో యాగం సంప్రదాయ పరంగా ప్రారంభమైందని ఎడిటర్, మీడియాకు తెలిపారు. ప్రతిరోజు వేద పారాయణాలు, వరుణ జపాలు ,ఋష్యశృంగ జపాలు , మహా భారతంలోని విరాట పర్వ పారాయణాలు నిర్వహిస్తారు . ఈ ఓ ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరిగాయని ఎడిటర్ తెలిపారు.
నిన్న ఉదయం ప్రారంభమైన యాగ సంబంధిత పూజాదికాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ కమిషనర్ డా.పద్మ , దేవస్థానం ఈ ఓ., ఎ . శ్రీరామచంద్రమూర్తి, దేవాదాయ తిరుపతి మల్టిజోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శ్రీమతి భ్రమరాంబ , దేవాదాయ శాఖ కర్నూలు డివిజన్ డిప్యూటి కమిషనర్ దేముళ్ళు , ఇతర అధికారులు , సిబ్బంది ,భక్తులు పాల్గొన్నారు.ముందుగా అధికారులు , ఋత్వికులు యాగ ద్రవ్యాలతో ఆలయ ప్రవేశం చేసి శ్రీ స్వామి అమ్మ వారలకు పూజాదికాలు జరిపారు. మంగళ వాయిద్యాలతో యాగశాల ప్రవేశం చేసారు . యాగా సంకల్పం చేసారు. వివిధ నీటి వనరులలో నీరు పుష్కలంగా చేరాలని సంకల్పం చేసారు. ఈ యాగం ఘనంగా జరగాలని మహా గణపతి పూజ చేసారు. స్థల శుద్ధి, స్వస్తి పుణ్యహవచనం జరిపారు. రుత్వికులందరికి దీక్ష వస్త్రాలు సమర్పించారు. చతుర్వేద పారాయణాల అనంతరం వరుణ యాగం ప్రారంభమైంది. ముందు యాగ ద్రవ్యాలున్న అలంకార శకటానికి పూజ, వర్షించే మేఘపు రంగు పోలిన గుర్రానికి , పొట్టేలుకు జలప్రోక్షణ చేసి పూజదికాలు చేసారు. రెండో రోజు కార్యక్రమాలు కూడా ఘనంగా జరిపారు.