×

లోక‌సంక్షేమం కోసం షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష-ఎవి.ధ‌ర్మారెడ్డి

లోక‌సంక్షేమం కోసం షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష-ఎవి.ధ‌ర్మారెడ్డి

*వ‌సంత మండ‌పంలో 16 రోజుల పాటు పారాయ‌ణం:

తిరుమల, సెప్టెంబరు 29, 2020: లోక సంక్షేమం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష‌ను ప్రారంభించామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైన ఈ దీక్ష అక్టోబ‌రు 14వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది. షోడ‌షాక్ష‌రి మ‌హామంత్రం ప్ర‌కారం మొద‌టి రోజు రా అనే అక్ష‌రానికి ఉన్న బీజాక్ష‌రాల ప్ర‌కారం సుంద‌ర‌కాండ‌లోని మొద‌టి స‌ర్గ‌లో 211, రెండో స‌ర్గ‌లో 58 క‌లిపి మొత్తం 269 శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. మొద‌ట సంక‌ల్పంతో ప్రారంభించి శ్రీ‌రామ ప్రార్థ‌న‌, శ్రీ ఆంజ‌నేయ ప్రార్థ‌న‌, శ్రీ వాల్మీకి ప్రార్థ‌న చేశారు. ఆ త‌రువాత 16 మంది ఉపాస‌కులు శ్లోక పారాయ‌ణం చేశారు. బుధ‌వారం  మూడో స‌ర్గ నుండి ఆరో స‌ర్గ వ‌రకు మొత్తం 152 శ్లోకాల‌ను పారాయ‌ణం చేయ‌నున్నారు.తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారి వివరాలు ఇవి.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ రాఘ‌వో విజ‌‌యం ద‌ద్యాన్మ‌మ సీతా ప‌తిఃప్ర‌భుః అనే మ‌హామంత్రం ప్రకారం సీతాస‌మేతుడైన శ్రీరామ‌చంద్రమూర్తిని ప్రార్థిస్తే సంక‌ల్ప‌సిద్ధి చేకూరుతుంద‌ని, ఈతిబాధ‌లు తొల‌గుతాయ‌ని తెలిపారు. ఈ మ‌హామంత్రంలో 16 అక్ష‌రాలు ఉన్నాయ‌ని, ఈ అక్షరాల‌కు ఉన్న బీజాక్ష‌రాల‌ను కూడితే ఆ సoఖ్య  68 అవుతుంద‌న్నారు. సుంద‌ర‌కాండ‌లో మొత్తం 68 స‌ర్గ‌లు ఉన్నాయ‌ని వివ‌రించారు. వీటిలోని 2,821 శ్లోకాల‌ను 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేస్తార‌ని తెలియ‌జేశారు. ఉపాస‌కులు ఒక‌పూట‌ మాత్ర‌మే భోజ‌నం, బ్ర‌హ్మ‌చ‌ర్యం, నేల‌పై విశ్ర‌మించ‌డం లాంటి నియ‌మాల‌ను పాటిస్తార‌ని చెప్పారు.

ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 9 గంట‌ల నుండి ఒక గంట పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని  ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నామ‌ని శ్రీ ధ‌ర్మారెడ్డి తెలిపారు. పారాయ‌ణం శ్లోకాల‌ను ఎస్వీబీసీలో స్క్రోలింగ్ ఇస్తున్నామ‌ని, www.svbcttd.com వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామ‌ని భ‌క్తులు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. శ్లోకాల‌ను ప‌ల‌క‌లేని  వారు ఏకాగ్ర‌త‌తో విన్నా స‌మాన‌మైన ఫ‌లితం ల‌భిస్తుంద‌న్నారు. భ‌క్తులంద‌రూ ఈ మ‌హాయ‌జ్ఞంలో పాల్గొని సంక‌ల్ప‌సిద్ధి పొందాల‌ని కోరారు.

ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని మాట్లాడుతూ సీతా స‌మేతుడైన శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి, ఆంజ‌నేయ‌స్వామివారి అ‌నుగ్ర‌హంతో  ప్ర‌పంచంలోని మాన‌వులు ధ‌ర్మాని ఆచ‌రిస్తూ, స‌క‌‌ల శుభాల‌ను పొందాల‌ని ఆకాంక్షిస్తూ షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష కార్య‌క్ర‌మాన్ని టిటిడి నిర్వ‌హిస్తోంద‌న్నారు. వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తార‌ని వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్‌, డెప్యూటీ ఈవో(ఆర్‌1)  బాలాజి, ఆరోగ్య‌శాఖాధికారి డా.ఆర్ఆర్‌.రెడ్డి, అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్  ద‌క్షిణామూర్తి, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, అన్న‌ప్ర‌సాదం ఏఈవో  లోక‌నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed