*కరోనా నివారణ చర్యలపై మూడవ రోజు శిక్షణ*
కరోనాను అరికట్టేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా దేవస్థాన సిబ్బందికి విడతలవారిగా శిక్షణ ఇస్తున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమాలు ఈ నెల 4వ తేదీన ప్రారంభించారు. . శివదీక్షా శిబిరాల వద్ద ఫుడ్ కోర్టులో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు .
గత రెండు రోజులలో భద్రతా, కల్యాణకట్ట, పారిశుద్ధ్య విభాగ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
ఈ రోజు ఉదయం హౌస్ కీపింగ్ సిబ్బందికి, సాయంత్రం ఆలయ, ఉద్యానవన విభాగాల వారికి ఈ శిక్షణ ఇచ్చారు.
ఉదయం జరిగిన శిక్షణలో సుమారు 120 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది, సాయంత్రం 192 మంది ఆలయ అర్చకస్వాములు, వేదపండితులు, పరిచారకులు, ఉద్యానవన సిబ్బందికి ఈ శిక్షణ ఇచ్చారు.
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. ఎం. సోమశేఖరయ్య, దేవస్థాన వైద్యులు డా.శివప్రకాశ్ లు శిక్షణనుఇచ్చారు.
ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ప్రసంగిస్తూ కరోనా నియంత్రణ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. స్వీయరక్షణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఇంటినుండి బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కును ధరించాలన్నారు. ప్రతి రెండుగంటలకు ఒకసారి 20 నుండి 40 సెకన్ల పాటు చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో పూర్తిగా శుభ్రపరచుకోవాలన్నారు. బయటకు వచ్చినప్పుడు అందరు కూడా తప్పనిసరిగా ఆరు అడుగుల భౌతికదూరాన్ని పాటించాలన్నారు. ఆలయములో భక్తులకు లఘుదర్శనం మాత్రమే కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతానికి దర్శనం తరువాత తీర్థం, శఠగోపం, ఉచిత ప్రసాద వితరణ ఇచ్చేందుకు అవకాశం లేదన్నారు.
దర్శనానికి ప్రవేశించే ముందు భక్తులు విధిగా తమ శరీర ఉష్ణోగ్రతను పరీక్షింపజేసుకోవాలన్నారు. క్యూలైన్లలో ప్రవేశించే భక్తులు తప్పనిసరిగా మాస్కును ధరించాల్సి వుంటుందన్నారు.
దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రదేశాలలో చేతులను శుభ్రపరుచుకోవాలన్నారు.
ప్రతి రెండుగంటలకు ఒకసారి ఆలయప్రాంగణాన్ని సోడియం హైపోప్లోరైడ్ ద్రావణాన్ని ఉపయోగించి శుభ్రపరచాలన్నారు. క్యూలైన్లలోని పైపులను కూడా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ ఉండాలన్నారు.
ఈ విషయములో ఆలయ, పారిశుద్ధ్య విభాగాలు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు.
తరువాత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. సోమశేఖర్ ప్రయోగపూర్వకంగా (డెమోద్వారా) మాస్కు ధరించడం, నిర్ణీత సమయం తరువాత మాస్కును తీసివేయడం, శానిటైజర్ లేదా సబ్బునీటితో చేతులను శుభ్రపరుచుకునే విధానం, శుభ్రపరుచుకోవడంలో గల దశలు, చేతులకు తొడుగులను (హ్యాండ్ గ్లాస్ లను) ధరించడం, నిర్ణీత సమయం తరువాత చేతుల తొడుగులను తీసివేయడం, వినియోగించిన మాస్కులను , ఫ్లాన్లను నిర్మూలించే విధానం, ధర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరీక్షించే విధానం, క్యూలైన్లు మొదలైన చోట్ల దేవస్థానం ఏర్పాటు చేయనున్న ఫుట్ ఆపరేటింగ్ శానిటైజింగ్ స్టాండును వినియోగించే విధానం మొదలైన అంశాలు సిబ్బందికి తెలియజెప్పారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. మురళీ బాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు ఎస్.వి. కృష్ణారెడ్డి, డి. మల్లయ్య, ఎం. హరిదాసు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు ఎన్. శ్రీహరి, శ్రీమతి టి. హిమబిందు తదితరులు పాల్గొన్నారు.