రైతులకు అందుతున్న మిషన్ కాకతీయ ఫలాలు – మెదక్‌లో 7200 చెరువులు ఉండగా ఇప్పటికే 5200 నిండాయి – భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖా మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలాలు రైతులకు అందుతున్నాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. జిల్లాలో 7200 చెరువులు ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం వరకే 5200 చెరువులు నిండాయని అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పాపన్నపేట, మెదక్ మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాలో ఏకైక మధ్య తరహా ఘనపూర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి గంగమ్మకు పూజలు చేసి హారతినిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఏడుపాయల దుర్గమ్మ దయవల్ల ఘనపూర్ ప్రాజెక్ట్ పొంగి పొర్లుతున్నదని, నిండిన చెరువులను చూస్తే ఎంత పెద్ద పదవీ వచ్చినా ఇంత సంతోషం ఉండదని అన్నారు. సిద్దిపేట జిల్లాతోపాటు మెదక్ జిల్లాను దసరా పండుగ రోజు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో మెదక్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీరు అంది సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. రూ.1024 కోట్లతో రాష్ట్రంలో మార్కెట్ కమిటీ గోదాంల నిర్మాణాలు జరుగుతున్నాయని, రూ.400 కోట్లతో మార్కెట్ కమిటీల ఆధునీకరణ పనులు నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. హరీశ్‌కు ఢిల్లీ నుంచి కేసీఆర్ ఫోన్ ————————————-
ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్‌రావుకు ఘనపూర్ ఆనకట్ట సందర్శిస్తున్న సమయంలో ఫోన్ చేశారు. రాష్ట్రంలోని సింగూరు, ఘనపూర్, శ్రీశైలంతోపాటు ప్రాజెక్ట్‌లపై వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిస్థితిపై ఆరా తీశారు. వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండేలా చర్యతీసుకోవాలని మంత్రి హరీశ్‌రావుకు కేసీఆర్ సూచించారు.