సోమవారం మాధాపూర్ హెచ్.ఐ.సి.సి.లో నిర్వహించిన రైతుబంధు జీవిత భీమా పథకం అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు.
పట్టాదారు రైతులందరికీ రైతుబంధు జీవిత బీమా పథకాన్ని ప్రకటించిన
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు
హైదరాబాదులోని HICC లో జరిగిన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వయంగా పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే రైతులకు జీవిత బీమా సౌకర్యాన్ని కలిగించిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో LIC చైర్మన్ వి.కె. శర్మ, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్. రైతుబంధు జీవిత బీమా పథకానికి సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రంపై సంతకాలు చేసారు.
LIC చైర్మన్ వి.కె. శర్మ మాట్లాడుతూరైతుబంధు జీవిత బీమా క్లెయిములను 10 రోజులలోనే చెల్లించి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఉన్న 57 లక్షల మంది రైతులకు 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు వారికి ఈ బీమా వర్తిస్తుందని ముఖ్యమంత్రి తెలియజేసారు. ఏ కారణం వల్లైనా రైతు చనిపోయినప్పుడు రు. 5 లక్షల బీమా మొత్తం రైతు కుటుంబానికి అందుతుందని తెలియజేసారు. రైతు మరణ ధృవీకరణ పత్రాన్ని గ్రామ పంచాయితీలోనే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రైతుబంధు సాగుకు పెట్టుబడి పథకం ద్వారా 89 శాతం రైతులు సంతోషంగా ఉన్నట్లు ప్రముఖ దిన పత్రిక ‘The Hindu’ కథనాన్ని గుర్తు చేసారు. దేశం అంతా మనవైపు చూస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఒకటి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులే దాదాపు 32 లక్షల మంది ఉన్నారని వారందరికి జీవిత బీమా ధైర్యాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. 15 ఆగష్టు 2018 నుంచి ఈ పథకం అమల్లోకి రావాలని అన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ మాట్లాడారు.