అత్యంత క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అందివ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది విఎఓలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు మొత్తం 35,749 మంది ఉద్యోగులకు ఒక నెల మూల వేతనం అదనంగా అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం వంద రోజుల వ్యవధిలోనే రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేసి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. విధి నిర్వహణ పట్ల ఇంతటి చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన ఉద్యోగులుండడం తెలంగాణ ప్రజలు, రైతుల అదృష్టంగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. తెలంగాణ ప్రజలు, రైతుల పక్షాన రెవెన్యూ ఉద్యోగులకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
‘‘దాదాపు 80 ఏళ్లుగా భూ రికార్డుల నిర్వహణ సరిగా లేదు. భూమి క్రయవిక్రయాలు, యాజమాన్యంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీంతో భూ రికార్డులు గందరగోళంగా మారాయి. తెలంగాణలో పంట పెట్టుబడి పథకం అమలు చేసేందుకు ఏ భూమికి ఎవరు యజమానో ఖచ్చితంగా తేలాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో భూ రికార్డులను సరిచేసి, పూర్తి పారదర్శకంగా పథకం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కేవలం వంద రోజుల్లోనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు గ్రామాల్లో తిరిగి, రైతులతో మాట్లాడి భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత తెచ్చారు. సొంత భూములున్న రైతులతో పాటు, అసైన్డ్ దారుల విషయంలో కూడా స్పష్టత సాధించారు. రాష్ట్రంలో 22.5 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచగా, అందులో 20 లక్షల ఎకరాల విషయంలో స్పష్టత వచ్చింది. మిగతా రెండున్నర లక్షల ఎకరాల విషయంలో స్పష్టత కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అటవీ-రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములు మినహాయిస్తే మిగతా విషయాల్లో పూర్తి సాధించారు. మమూలు సాధారణ విషయం కాదు. దేశంలో ఎవరూ సాధించని ఘనత రెవెన్యూ ఉద్యోగులు సాధించారు. వారికి ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఒక నెల మూల వేతనాన్ని అదనంగా అందిస్తాం’’ అని సీఎం ప్రకటించారు.
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పాసు పుస్తకాల పంపిణీపై ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ సలహాదారు జి.ఆర్. రెడ్డి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, రాజేశ్వర్ తివారి, రామకృష్ణ రావు, శివశంకర్, శ్రీమతి వాకాటి కరుణ, శ్రీమతి స్మితా సభర్వాల్, కలెక్టర్లు రఘునందన్ రావు, ఎంవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘‘కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో భూ రికార్డుల ప్రక్షాళన నిరూపించింది. చిన్న జిల్లాలుండడం వల్లనే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యమైంది. కొత్త కలెక్టర్ల ప్రతిభకు, పనితీరుకు ఇది గీటురాయి. కలెక్టర్లు తమ విధిని గొప్పగా నిర్వహించారు’’ అని సీఎం అభినందించారు.
‘‘తెలంగాణ రాష్ట్రంలో అధికశాతం మంది అధికారులు, ఉద్యోగులు నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో ఎంతో మార్పు వచ్చింది. కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఎంతగానో కష్టపడడం వల్ల ప్రజారోగ్యం మెరుగుపడింది. గతంలో రెండు లక్షల లోపే ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేవి. ఇప్పుడా సంఖ్య చాలా పెరిగింది. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్లు, రోడ్ల నిర్మాణంలో పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి అధికారులు, ఇంకా ఇతర శాఖల అధికారులు చాలా కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు కూడా అత్యంత పారదర్శకంగా ఉన్నాయి. అవినీతికి ఆస్కారం ఇవ్వని విధంగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాలను అమలు చేస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు లభించాలన్నదే ప్రభుత్వ అభిమతం. అందుకే తెలంగాణ వచ్చిన వెంటనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంటుతో వేతన సవరణ చేశాం. తెలంగాణ ఇంక్రిమెంటు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా ఉద్యోగులకు మంచి జీతభత్యాలు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.