రూ.15.60 ల‌క్ష‌లు పలికిన బాలాపూర్ ల‌డ్డు

రూ.15.60 ల‌క్ష‌లు పలికిన బాలాపూర్ ల‌డ్డు –  వేలం పాటలో స్వంతం చేసుకున్న జూబ్లీహిల్స్ కు చెందిన నాగం తిరుప‌తిరెడ్డి

హైద‌రాబాద్‌ సెప్టెంబర్ 5(ఎక్స్ ప్రెస్ న్యూస్): భాగ్య‌న‌గ‌రంలో గణేశ్ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి… ఏటేటా భక్తుల్లో ఆసక్తిని రేకెత్తించే గణనాథుడు బాలాపూర్ గణేశుడు  ఆ గ్రామ‌ వాసులకు కొంగుబంగారంగా నిలుస్తున్నాడు. 1980లో మొదలైన బాలాపూర్ గణేశుడి ప్రస్థానం… 23 ఏళ్లుగా లడ్డూ వేలం పాటతో మరింత ఖ్యాతిని చాటుకుంది. స్థానికులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఇక్కడి గణేశుడి దర్శనానికి వస్తుంటారు. లంబోదరుడిని మనసారా దర్శించుకొని ఆయన చేతిలో ఉన్న లడ్డూను తాకితే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సర్వవిఘ్నాధిపతి చేతిలో ఉన్న లడ్డూ చేజిక్కించుకుంటే సిరిసంపదలు దక్కుతాయని విశ్వాసం. అందుకే ఇక్కడ 1994 నుంచి లడ్డూ వేలం పాట మొదలుపెట్టారు. మొదట 450 రూపాయలతో ప్రారంభమైన లడ్డూ వేలం…క్రమంగా వందలు, వేలు దాటి లక్షలకు చేరింది. గణేశ్ లడ్డూ దక్కించుకున్నవారి ఇంట సిరిసంపదలు తులతూగుతాయని, పసిడి పంటలు పండుతాయని ఆ ప్రాంత వాసుల‌ నమ్మకం. ఆ విశ్వాసంతోనే స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డూను వేలంలో పాడుకొని భక్తిని చాటుకుంటారు. పేద, ధనిక, రైతు, రాజకీయ నాయకులని తేడా లేకుండా అంతా వేలంపాటలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా ప్రతిష్ఠాత్మకంగా వేలం పాటకు హాజరై లడ్డూను దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. మొదట బాలాపూర్ వాసులే వేలం పాటలో పాల్గొనేవారు. ఆ తర్వాత క్రమంగా స్థానికేతరుల‌కు అవకాశం కల్పించడంతో 23 ఏళ్లుగా బాలాపూర్ లడ్డూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ భక్తుల పాలిట వరంగా మారుతోంది.బాలాపూర్ గణేశుడి చేతిలో ఉండే లడ్డూను ఈసీఐఎల్ లోని తాపేశ్వరం హనీపుడ్స్ తయారుచేస్తుంది. 21 కిలోల బరువు ఉండే ఈ లడ్డూను 2010 నుంచి బాలాపూర్ గణేశుడికి ఆ దుకాణ యజమాని ఉమామహేశ్వర్ రావు  నైవేద్యంగా సమర్పిస్తున్నారు. లడ్డూతో పాటు 2 కిలోల వెండి గిన్నెను స్వామివారికిసమర్పించిభక్తినిచాటుకుంటున్నారు. రికార్డుస్థాయిలోధ‌ర‌..  ఏటేటా కార్డుస్థాయిలో ధర పలికే బాలాపూర్ లడ్డూ… 2002 సంవత్సరం నుంచి లక్షలు దాటింది. అంతకుముందు స్థానికులైన కొలను కుటుంబసభ్యులే వరుసగా లడ్డూను చేజిక్కించుకునేవారు.

కానీ స్థానికేతరులు కూడా రంగంలోకి దిగడంతో లక్ష కాస్త మరో లక్షకు చేరింది. అలా… 2008లో 5.07 లక్ష‌లు, 2009లో 5.10 ల‌క్ష‌లు, 2010లో 5.35 ల‌క్ష‌లు, 2011లో 5.45ల‌క్ష‌లు, 2012లో ఏకంగా 7.50 ల‌క్ష‌లు ప‌లికింది.   2013లో మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి ఏకంగా రూ.9.26 ల‌క్ష‌ల‌కు  లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం 2014 లో బాలాపూర్ కు చెందిన రైతు సింగిరెడ్డి జైహింద్ రెడ్డి పోటీపడి 9. 50 ల‌క్ష‌ల‌కు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2015లో కళ్లెం రామకృష్ణారెడ్డి, మదన్ మోహన్ రెడ్డిలు తమ తండ్రి కళ్లెం రాంరెడ్డి జ్ఞాపకార్థం. రూ.10.32ల‌క్ష‌ల‌కు గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. 2016లో మేడ్చల్ కు చెందిన స్కైలాబ్ రెడ్డి రికార్డుస్థాయిలో 14.65 ల‌క్ష‌ల‌ రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు.

ఇక ఈ ఏడాది జూబ్లీహిల్స్ కు చెందిన నాగం తిరుప‌తిరెడ్డి ఏకంగా రూ. 15.60 ల‌క్ష‌లకు ల‌డ్డూను సొంతం చేసుకున్నారు.  గ్రామాభివృద్ధికి సాయం.. ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా ఏటా సంప్రదాయంగా వస్తోన్న ఈ లడ్డూ వేలం పాట……బాలపూర్ గ్రామ రూపురేఖలు మారుస్తుండటం విశేషం. వేలం పాట ద్వారా వచ్చే నగదును గణేశ్ ఉత్సవ సమితి గ్రామంలో అభివృద్ధి పనులకు, సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. వేలంపాట ద్వారా వచ్చిన నగదులో ఇప్పటి వరకు వివిధ అభివృద్ధి పనుల కోసం 39 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రతి రూపాయి పారదర్శకంగా ప్రజల సమక్షంలో ఖర్చు చేస్తుండటంతో గ్రామంలో ఎలాంటి  బేధాభిప్రాయాలకు తావులేకుండా పోయింది. గ్రామ శ్రేయస్సును కాంక్షిస్తూ ఏటా ఉత్సవ సమితి అత్యంత భక్తిశ్రద్దలతో వేడుకలను అంగరంగ వైభంగా నిర్వహిస్తూ వస్తుండటంతో బాలాపూర్ గణేశుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు.హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. మహాగణపతి నిమజ్జనం గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య అట్టహాసంగా ముగిసింది. కన్నుల పండువగా నిర్వహించిన శోభాయాత్ర ద్వారా భారీ వాహనంపై ఖైరతాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న మహాగణపతికి అర్చకులు తుది పూజలు నిర్వహించారు. అనంతరం భారీ క్రేన్‌ ద్వారా గణపతిని హుస్సేన్‌సాగర్‌ జలాల్లో నిమజ్జనం చేశారు.

అధికారుల విజ్ఞప్తి మేరకు గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు ఉదయమే మహాగణపతి శోభాయాత్ర ప్రారంభించారు. విగ్రహాన్ని మండపం నుంచి వేరుచేసి రవి క్రేన్స్‌కు చెందిన హైడ్రాలిక్‌ టెలీస్కోప్‌ మొబైల్‌ క్రేన్‌’ ద్వారా భారీ వాహనంపైకి ఎక్కించారు. 60 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు గల భారీ వాహనంపై గణనాథుడు హుస్సేన్‌సాగర్‌కు బయలుదేరాడు. భక్తజనం అడుగడుగునా మహాగణపతికి నీరాజనం పలికారు.  గతంలో కంటే ఈ ఏడాది నిమజ్జనం రోజునే ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనం చేశారు. అధికారులు అన్ని చర్యలు తీసుకోవడంతో అనుకున్న సమయానికే గణేశుడు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాడు. అనంతరం ట్రాలీ నుంచి విగ్రహాన్ని దించి భారీ క్రేన్‌ సాయంతో హుస్సేన్‌సాగర్‌ జలాల్లో నిమజ్జనం చేశారు.మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఆ ప్రాంతం భక్తులతో కోలాహలంగా మారింది. ట్యాంక్ బండ్ పై సందడి వాతావరణం నెలకొంది.ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. నగరం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరుతున్న సమయంలో జయజయ ధ్వానాలు పలికారు.గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప‌టిష్ఠ‌ చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.గణనాథుల నిమజ్జన యాత్ర శోభాయమానంగా కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ కు తొమ్మిది ప్రధాన మార్గాల్లో గణనాథులు చేరుతున్నాయి. ప్రధాన శోభాయాత్రతో పాటు నగరంలో మొత్తం 21 ఊరేగింపు మార్గాల్లో గణనాథులు ఊరేగుతున్నాయి. గణనాథుల శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.ఇక నిమజ్జనం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నగరంలో 28 ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి11గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 26 వేల మంది పోలీసులు విధి నిర్వహణలో ఉన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. నిమజ్జన కార్యక్రమం వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.