రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. చైర్మన్ గా సామాజిక తత్వవేత్త, రచయిత బీఎస్ రాములును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సభ్యులుగా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, డాక్టర్ ఈడిగ ఆంజనేయులు గౌడ్, జూలూరి గౌరీశంకర్ లను నియమించింది. కమిషన్ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఉండే సౌకర్యాలు బీసీ కమిషన్ కు ఉంటాయి.
జగిత్యాల జిల్లాకు చెందిన బీఎస్ రాములు సుప్రసిద్ధ రచయిత, బహు గ్రంథకర్త, సామాజిక అంశాలపై కృషి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. బీసీల జీవన స్థితిగతులపై అనేక రచనలు చేశారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 నుంచి 2009 వరకు రెండుసార్లు బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేశారు. బీసీ ఉద్యమ నేతగా, రచయితగా, మంచి వక్తగా ఆయనకు పేరుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఎ(తెలుగు), పీహెచ్.డి చేశారు.
ప్రముఖ రచయిత, కవి జూలూరి గౌరీశంకర్ ప్రస్తుత సూర్యాపేట జిల్లా కోదాడ వాసి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా పనిచేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన డాక్టర్ ఈడిగ ఆంజనేయులు గౌడ్ విద్యార్థి నాయకుడిగా పేరు గడించారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పీహెచ్.డి చేశారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు.