×

రానున్న 45 రోజుల్లో పరిశ్రమలకు రూ.2,500 కోట్ల విలువైన రాయితీలు

రానున్న 45 రోజుల్లో పరిశ్రమలకు రూ.2,500 కోట్ల విలువైన రాయితీలు

* కృష్ణా, గుంటూరు జిల్లాల పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
 అమరావతి, జూలై 3: రానున్న 45 రోజుల్లో రూ.2,500 కోట్ల విలువైన పారిశ్రామిక రాయితీలు ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దేశంలో విద్యుత్తు చార్జీలు పెంచబోమని ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో మంగళవారం రాత్రి కృష్ణా, గుంటూరు జిల్లాల పారిశ్రామికవేత్తల ఇంటరాక్టివ్ సెషన్ లో మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు దేశంలో వ్యాపార అనుకూలత కలిగిన రాష్ట్రాలలో నెంబర్-1 గా ప్రపంచ  బ్యాంకు ర్యాంకింగ్ ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్తు రంగ అభివృద్ధిలో ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించి అమలు చేసి ఉంటే బాగుండేదన్నారు. తమ ప్రభుత్వం హైబ్రీడ్ విద్యుత్తు నిల్వచేసే టెక్నాలజీని తీసుకురానున్నదని చంద్రబాబు తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పవర్ హాలిడేలతో  అంధకారం నెలకొన్నదని, పెద్దసంఖ్యలో పరిశ్రమలు మూతపడిన చేదు అనుభవాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో రోజుకు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొరత ఉండేదని, తాను ముఖ్యమంత్రి కాగానే 3 నెలలకే విద్యుత్తు వ్యవస్థను సక్రమ స్థితికి తెచ్చామని, ఏడాదికే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దామని చంద్రబాబు తెలిపారు.  తమ ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు, నిరంతర విద్యుత్తు తదితర ప్రోత్సాహకాలను బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు సూచించారు. మొబైల్ నుంచి ఆటోమొబైల్ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
 ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా ఎదిరించి తీరతామని,  ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని ఏ శక్తీ అడ్డుకోలేదని,పారిశ్రామికవేత్తల మద్దతు, సహకారం ఉంటే దేశంలో పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్-1గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.   ఎం.ఎస్.ఎం.ఇ లను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్నారైలను సంప్రదించి రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చేందుకు పారిశ్రామికవేత్తలు తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాము అధికారంలోకి రాగానే రూపకల్పన చేసిన  నూతన పారిశ్రామిక విధానం, సింగిల్ విండో విధానం వల్ల పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతర్జాతీయంగా అమరావతికి ఒక బ్రాండ్ తెచ్చామని, నూతన విధానాలతో రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. తాము చేసిన అనేక విదేశీ పర్యటనలు ఫలప్రదమయ్యాయని, ఒక్కటొక్కటిగా ఫలితాలు ఒనగూరుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఒక విజన్ తో ముందుకు వెళుతున్నామని, అగ్రగామిగా ఎదగడం ధ్యేయమని వివరించారు. దశలవారీ అభివృద్ధితో 15% వృద్ధి రేటు సాధించటం లక్ష్యమన్నారు. వ్యాపార అనుకూలత గల రాష్ట్రాలలో దేశంలో మన రాష్ట్రానికి ప్రపంచబ్యాంకు నెంబర్-1 ర్యాంకు ఇచ్చిందని, విశాఖలో మూడు విశ్వస్థాయి పారిశ్రామిక సదస్సులు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 18 విభాగాల ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలతో  పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు  సీఎం తెలిపారు.
 దేశవిదేశీ పారిశ్రామికవేత్తలతో అనేక ప్రాథమిక అవగాహనా ఒప్పందాలు చేసుకున్నామని, అనేకం కార్యరూపం ధరించాయని చంద్రబాబు అన్నారు.
 రాష్ట్రంలో జలవనరుల అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించామని, నదుల అనుసంధానంతో మూడేళ్లుగా ఫలితాలు చూపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం చుట్టుపక్కల నిర్మాణంలో ఉన్న జలవనరుల ప్రాజెక్టులు పూర్తయితే  అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం సత్ఫలితాలనిచ్చిందని,  ఈ స్ఫూర్తితో సమీప భవిష్యత్తులో తాము పెన్నా, కృష్ణా, గోదావరి, నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని అన్నారు. ప్రతిగ్రామానికీ రహదారి సదుపాయం ఏర్పర్చి బాహ్యప్రపంచంతో సరైన రీతిలో రవాణా సదుపాయాలు ఏర్పరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
 పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి ప్రణాళికా దశలో ఉందని, లాజిస్టిక్స్ లో మన రాష్ట్రం దేశంలో కేంద్రస్థానంలో ఉందని, ఈ సానుకూలతను ఉపయోగించుకుని పరిశ్రమల అభివృద్ధికి స్థిరమై విధానానికి రూపకల్పన చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
 తాము సాగించిన ఎంతో కృషి, ఎన్నో ప్రయత్నాల వల్ల రాష్ట్రానికి కియా మోటార్స్ భారీ పెట్టుబడులతో వచ్చిందని, అపోలో టైర్స్ పరిశ్రమ ఏర్పాటు సాకారమవుతోందని గుర్తు చేస్తూ ప్రతి పెట్టుబడి ఒక విజయగాధగా రూపొందుతుందన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా క్రియాశీలకంగా ఉంటారని, ప్రపంచంలో నిపుణులుగా రాణిస్తున్న విషయాన్ని గుర్తు చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగువారు ప్రపంచంలో ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా తయారు కావాలన్నది తమ అభిమతమని ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామిక సదస్సులో పరిశ్రమల మంత్రి ఎన్. అమరనాథరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్ధ జైన్, ఏపీఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, ఏపీఐఐసీ చైర్మన్ అహ్మద్ బాబు,ఎఫక్ట్రానిక్స్ ఎండీ డి. రామకృష్ణ, నలంద ఎండీ ఎ. విజయబాబు, ఫార్చూన్ హోటల్ ఎండీ ఎం. మురళీ కృష్ణ, , డీవీ మనోర్ కు చెందిన డి.  నాగేంద్రబాబు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
print

Post Comment

You May Have Missed