యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం- ఆదేశించిన కేసీయార్

 కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణాలన్నీ మార్చి చివరి నాటికే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ అధికారులను, వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు.
గోదావరిలో కాపర్ డ్యామ్ ఏర్పాటు చేసుకుని ఏప్రిల్ నెలలో ట్రయల్ రన్ నిర్వహించాలని చెప్పారు. ఈ వర్షాకాంలోనే గోదావరి నీటిని మిడ్ మానేరు వరకు ఎత్తిపోసేలా ప్రణాళిక వేసుకుని, అమలు చేయాలని సూచించారు.

రైతులు సాగునీటి కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజి, కన్నెపల్లి పంపుహౌజులను సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించారు. అక్కడికక్కడే పలు సూచనలు చేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారెజ్ ల నిర్మాణంతో పాటు పంపుహౌస్ ల నిర్మాణం పనులు, మోటార్ల ఏర్పాటు పనులన్ని సమాంతరంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మార్చి 31 వరకు ప్రధానమైన పనులన్ని పూర్తిచేసి ఏప్రిల్, మే నేలల్లో ఇతర సమస్యలన్నింటిని పరిష్కరించుకుని ఎట్టి పరిస్థితుల్లోను జూన్ లో సాగునీరు అందించడానికి సిద్ధం కావాలని సీఎం సూచించారు.

గోదావరిలో తెలంగాణ వాటా నీళ్లను వీలైనంత త్వరగా ఉపయోగించుకోవాలంటే, పంపు హౌస్ ల నిర్మాణం, మోటార్ల బిగింపు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. గోదావరికి రెండు వైపుల ఉండే ఫ్లడ్ బ్యాంక్స్ పనులను పరిశీలించిన కేసీఆర్, మట్టిపని రివిట్ మెంట్ పనులను పూర్తి జలాశయ మట్టం దాకా పూర్తి చేయాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులను, గేట్లను ఆపరేట్ చేసే విధానాన్ని పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ పనులను జనవరి నెలాఖరు లోపల పూర్తి చేయాలని సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ కాంక్రిటు వర్క్ రోజుకు 10 వేల క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా చేయాలని వర్కింగ్ ఏజెన్సీని ఆదేశించారు.
కన్నేపల్లి పంపు హౌస్ ఫోర్ బే, హెడ్ రేగ్యులేటర్ పనులను పరిశీలించిన సందర్భంగా, హెడ్ రేగ్యులేటర్ పనుల్లో ఉన్న సాంకేతిక లోపలను సవరించాలని సూచించారు. కన్నేపల్లి పంపు హౌస్ పనులను, 11 పంపులు బిగించే ప్రక్రియను మార్చి చివరి కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. సముద్ర మార్గంలో చెన్నై దాకా చేరుకుని, పోర్టులో వున్న మోటార్లను కూడా వెంటనే తెప్పించాలని అధికారులకు సూచించారు.
నిధుల పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తిచేసే విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రజలు గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రభుత్వం కూడా చిత్తశుద్ది చాటుకుంటుందని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎంవో సెక్రటరీ ప్రతి పది రోజులకు ఒకసారి పర్యవేక్షిస్తారని సీఎం తెలిపారు. సబ్ స్టేషన్ పనులను పూర్తిచేయాలని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావును సీఎం ఫోన్ లో ఆదేశించారు.
ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషీ, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, దివాకర్ రావు, శ్రీధర్ బాబు, టీఎస్ ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి. ప్రకాష్, ఐడీసీ ఛైర్మన్ ఈద శంకర్ రెడ్డి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, సీఈ వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్ డి శ్రీధర్ రావు దేశ్ పాండే, లిప్ట్ సలహాదారు పెంటారెడ్డి, ఎల్ అండ్ టి సీఎండి సుబ్రామ్మణ్యన్, మెగా ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

print

Post Comment

You May Have Missed