లక్ష్మీనృసింహ, మమదేహి కరావలంబమ్.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు – 2020 లో రెండవరోజు అత్యంత వైభవంగా ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వానం, హవనము కార్యక్రమాలు జరిగాయి. 07-03-2020 వరకు శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా నిర్వహిస్తారు. రెండవ రోజు గురువారము ఉదయం శ్రీ స్వామి వారి బాలాలయములో నిత్య ఆరాధనల అనంతరము ఉll 11.00లకు ధ్వజారోహణ శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా స్థానాచార్యులు, ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఆలయ అర్చక బృందము, పారాయణీకులు నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహామూర్తి, కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.గీత, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ రోజు డా. మంచాల నవీన్ కుమార్, బి.డి.ఎస్. వాసవి దంత వైద్యశాల, భువనగిరి వారు, డా. మంచాల మాధురి ఎమ్.డి. ( హోమియో) అనఘా హోమియో క్లీనిక్, భువనగిరి వారిచే ఉచిత దంత, హోమియో వైద్య శిబిరము శ్రీ స్వామి వారి సన్నిధిలో నిర్వహించారు. సుమారు 200 మంది వరకు ఉచిత సేవలను పొందారు.