యాదాద్రి జిల్లాను ‘‘యాదాద్రి భువనగిరి’’ జిల్లాగా పిలవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట, జిల్లా కేంద్రంగా భువనగిరి జంటగా అభివృద్ది చెందుతాయని సిఎం అన్నారు. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంచాలని సూచించారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన భువనగిరిలోని ఎలిమినేటి క్రిష్ణారెడ్డి ఇంటికి బుధవారం సాయంత్రం సిఎం వెళ్లారు. ఆరోగ్యం, కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ సమయంలో గడిపిన సందర్భాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లా కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో భువనగిరి పట్టణం చాలా అభివృద్ది చెందుతుంది అన్నారు. ఎంఎంటిఎస్, రీజినల్ రింగ్ రోడ్ భువనగిరి నుండే వెళతాయి కాబట్టి రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని సిఎం హామి ఇచ్చారు.