*యాజమాన్యంతో యూనియన్ నాయకుల చర్చలు ఫలించి స్థూడియో ఎన్ తాళం తొలగి ఉద్యోగులు సమ్మె విరమించారు .*
నెలల తరబడి బకాయిలో ఉన్న జీతాలు చెల్లించాలని, సిఇఓ నీలిమా ఆర్య నుండి వేధింపులను నివారించాలని, జీతాల నుండి ప్రతి నెల కత్తిరిస్తున్న పీఎఫ్, ఇఎస్ఐ అకౌంట్లలో డబ్బులు జమా చెయ్యాలని తదితర డిమాండ్లతో మూడు రోజులుగా విధులను బహిష్కరించి కార్యాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగిన స్టూడియో ఎన్ న్యూస్ ఛానెల్ సిబ్బందికి టీయుడబ్ల్యుజె-ఐజేయు సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకుంటే న్యాయ పోరాటానికి పునుకుంటామని టీయుడబ్ల్యుజె-ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ రెండు రోజుల క్రితమే యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్ లోకేశ్వర్ ఇవ్వాళ హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకొని టీయుడబ్ల్యుజె-ఐజేయు నాయకులను చర్చలకు ఆహ్వానించారు. సుమారు గంట పాటు జరిగిన ఈ చర్చల్లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ నేతృత్వంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతు రమేష్, రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్, హెచ్ యు జె కార్యదర్శి శిగ శంకర్ గౌడ్ లు పాల్గొన్నారు. చర్చలకు ముందు ఉద్యోగులతో సుమారు రెండు గంటల పాటు సమావేశమైన టీయుడబ్ల్యుజె-ఐజేయు నాయకులు వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. అనంతరం జరిగిన చర్చల్లో ఉద్యోగుల గొంతుకగా విరాహత్ అలీ మాట్లాడుతూ, ఏడాది కాలంగా సిఇఓ నీలిమ ఆర్య ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తోందన్నారు .ఉద్యోగాన్ని నమ్ముకొని జీవిస్తున్న
ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు చెల్లించకుంటే వారు కుటుంబాలను పోషించుకునేదెలా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల జీతల నుండి కత్తిరిస్తున్న పీఎఫ్, ఇఎస్ఐ లను యాజమాన్యం వారి అకౌంట్లలో జమా చేయకపోవడం చట్టవిరుద్దమని విరాహత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎండి లోకేశ్వర్ మాట్లాడుతూ, జూన్ మాసం వరకు ఉద్యోగులకు బకాయిలో ఉన్న మొత్తం జీతాన్ని రెండు రోజుల్లో
(జూలై 12 వరకు) చెల్లిస్తామని అంగీకరించారు. పీఎఫ్, ఇఎస్ఐ అకౌంట్లను కూడా త్వరలో సెటిల్మెంట్ చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఇకనుండి ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఎదురైనా సిఇఓ జోక్యం లేకుండా స్వయంగా తానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సిఇఓ పై వస్తున్న ఆరోపణలపై బోర్డులో చర్చించి తగు చర్యలు చేపడతామన్నారు. సమ్మెకు దిగిన ఉద్యోగుల్లో 15 మందిని టార్గెట్ చేసి సిఇఓ జారీచేసిన నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు యూనియన్ నాయకులకు లోకేష్ లిఖితపూర్వక అంగీకార పత్రాన్ని అందించారు. అనంతరం కార్యాలయానికి ఉద్యోగులు వేసిన తాళాన్ని యూనియన్ నాయకులు తెరిపించారు. ఈ చర్చల్లో మరో జర్నలిస్టు సంఘం నాయకులు క్రాంతి తదితరులు పాల్గొన్నారు .తమ ఆందోళనకు మద్దతు ప్రకటించడమే కాకుండా తమ గొంతుకగా యాజమాన్యంతో చర్చించి సమస్యలను పరిష్కరించడానికి నిబద్ధతతో నిజాయితీగా కృషి చేసిన యూనియన్ నాయకులకు ఉద్యోగులు థాంక్స్ చెప్పారు .