తిరుమల,సెప్టెంబర్ 17 :శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన సోమవారం ఉదయం శ్రీహరి మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు. పక్కనే శ్రీకృష్ణుడు అలంకృతుడై మరో తిరుచ్చిపై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత రమణీయంగా జరిగింది.
ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు చాటి చెబుతున్నారు.అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధి కె.యస్.శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు మేడా రామకృష్ణారెడ్డి, శ్రీమతి సుధానారాయణమూర్తి, పొట్లూరి రమేష్ బాబు, ప్రత్యేక ఆహ్వానితులు రాఘవేంద్రరావు, ఎన్.కృష్ణ, ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
————————————————–