మీడియా యాజమాన్యాలు సైతం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలి – ఉపరాష్ట్రపతి

ఢిల్లీ : గ్రామాలు, వ్యవసాయరంగం మీద ప్రభుత్వమే కాకుండా మీడియా కూడా దృష్టి పెడితే గ్రామ స్వరాజ్యం సాధ్యమౌతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ వచ్చిన 40 మందికి పైగా జర్నలిస్టులు మంగళవారం ఉపరాష్ట్రపతిని కలిశారు.  జర్నలిస్టులు తమ సమస్యలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. సమాచార శాఖ మంత్రిని పిలిపించి, చర్చిస్తానని ఉపరాష్ట్రపతి హామీ ఇచ్చారు. విలువలతో కూడిన జర్నలిజానికి పెద్ద పీట వేయాలని, సంచలనాలు లేని, వాస్తవాలు ఉన్న వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. మీడియా యాజమాన్యాలు సైతం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని, అప్పుడే నీతినిజాయితీలతో స్వేచ్ఛగా జర్నలిస్టులు పని చేస్తారని అన్నారు. ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.ఎన్.సిన్హా,  దేవులపల్లి అమర్,  కె.శ్రీనివాస్ రెడ్డి,  సబీనా ఇంద్రజిత్,  ఎన్. శేఖర్,
కె .విరాహత్ అలీ,  వై.నరేందర్ రెడ్డి,  ఎం.ఎ.మజీద్,  డి.కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు;
• తెలుగు జర్నలిస్టులందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఒకప్పుడు పత్రికలు ఆశయంతో స్థాపించే వారు. ఇప్పుడు వ్యాపారవేత్తలు పత్రికలను ప్రారంభిస్తున్నారు.
• వార్త సంచలనాలకు వేదికగా మారకూడదు. సంచలనానికి దూరంగా, సత్యానికి దగ్గరగా, నిజానికి నిలువుటద్దంగా, సమాజంలో స్ఫూర్తి నింపేలా వార్తలు ఉండాలి.
• న్యూస్, వ్యూస్ వేరువేరుగా ఉండాలి. సొంత భావజాలాన్ని వార్తలతో కలపకూడదు. జర్నలిజం అనేది ఒక మిషన్. కమీషన్ కోసం కాదు. ఈ విషయాన్ని ప్రతి జర్నలిస్టు గుర్తించాలి.
• ఇన్ఫర్మేషన్ వార్త కాదు. కన్ఫర్మేషన్ ఉంటేనే వార్త. వాస్తవానికి ప్రతిరూపమైన వార్త… సమాచారం ఆయుధం  కంటే గొప్పది.  ప్రభుత్వాలను కూడా కదిలించగలిగింది.
• పత్రికలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రతిభను ప్రోత్సహించాలి. నీతి, నిజాయితీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అరాచకాలు, అడ్డదారుల్లో వెళ్ళే వారికి ప్రాధాన్యత ఇవ్వకూడదు.
• పత్రికలు స్వతంత్రంగా పని చేయాలి. జర్నలిస్టులు సంక్షేమానికి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం సరైన వాతావరణం కల్పించినప్పుడే జర్నలిస్టులు నీతిగా పని చేయడం సాధ్యమౌతుంది.
• జర్నలిస్టులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పేద వర్గాల పక్షం వహించాలి. ప్రపంచం వేగంగా ముందుకు వెళుతుంటే, గ్రామాలు ఆ వేగాన్ని అందుకోలేక వెనుకబడ్డాయి. అలాంటి వాటి మీద పత్రికలు దృష్టి కేంద్రీకరించాలి.
• గ్రామాలతో పాటు వ్యవసాయం మీద కూడా మీడియా దృష్టి సారించాలి. పార్లమెంట్, రాజకీయ పార్టీలు, మీడియా, నీతిఆయోగ్ సంయుక్తంగా వ్యవసాయం మీద దృష్టి పెట్టాలని ఆకాంక్షిస్తున్నాను.

print

Post Comment

You May Have Missed