మీడియా పెద్దలతో త్వరలో సమావేశం -సినీ ప్రముఖులు

మీడియా కు , సినీ పరిశ్రమ కు ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించుకోవాలని, అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకోవద్దని టి. యు .డబ్ల్యూ. జె. నేతలు సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. ఫిలిం ఛాంబర్ వద్ద మీడియా వాహనాలపై (ఏ.బి.ఎన్) దాడి అనంతరం మీడియాను హెచ్చరిస్తూ సినీ ప్రముఖులు కొందరు  ప్రకటనలు జారీ చేసారు . చివరకు మీడియా ను నిషేధిస్తాం అంటూ సినిమా పరిశ్రమ పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ ఛానెల్ ల ఎడిటర్ లు ఆరోపించిన నేపథ్యంలో సమస్యను సామస్యపూర్వకంగా పరిష్కరించుకోడానికి అల్లం నారాయణ నేతృత్వంలో   టి. యు. డబ్ల్యూ. జె. రంగంలోకి దిగింది. బెదిరించి, బ్యాన్ చేసి మీడియాను దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేయొద్దని, వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని టి. యు .డబ్ల్యూ. జె. అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ సినీ పెద్దలకు సూచించారు. ఫిలిం నగర్ క్లబ్ లో జరిగిన సమావేశంలో పరిశ్రమ తరఫున సురేష్ బాబు, అల్లు అరవింద్, కె. ఎల్. నారాయణ, ఎన్ .శంకర్  హాజరు కాగా  టి. యు .డబ్ల్యూ .జె .తరఫున  అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతి, ట్రెజరర్ మారుతి సాగర్ లు పాల్గొన్నారు. రెండు గంటల పాటు సాగిన సమావేశంలో  గత నెల రోజులుగా మీడియా కు, సినీ పరిశ్రమకు ఏర్పడ్డ స్పర్థలపై చర్చించారు . మీడియా ప్రసారాలపై భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని మీడియా దృష్టికి తీసుకురావాల్సింది కానీ బెదిరిస్తే కుదరదు అని తేల్చి చెప్పారు.  మీడియాను బ్యాన్ చేయాలనే ఆలోచన తమకు లేదని మీడియా తో స్నేహపూర్వకంగానే వుంటున్నామని అయితే కొన్ని మీడియా ల వల్ల సినీపరిశ్రమ పై ప్రజల్లో దూరభిప్రాయం ఏర్పడే పరిస్థితి వచ్చిందని సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా మీడియా పెద్దలతో త్వరలో సమావేశం అవుతామని స్నేహపూర్వకంగానే సమస్యను పరిష్కరించాలని తాము  కూడా అనుకుంటున్నామని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.