మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో ఇంటింటికి మంచినీళ్లు అందించే కార్యక్రమం దళిత వాడల నుంచే ప్రారంభం కావాలని, దళితుల ఇండ్లకు నీళ్లిచ్చి నల్లాలు బిగించిన తర్వాతే మిగతా ఇండ్లకు ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మిషన్ భగీరథ పథకంలో ఉపయోగించే మోటార్లను బి.హెచ్.ఇ.ఎల్. నుంచి సమకూర్చుకోవాలని చెప్పారు. మంత్రులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించాలని సిఎం కోరారు. 2017 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు గోదావరి, కృష్ణా జలాలు చేరుకునేలా పనులు పూర్తి కావాలని, తదనంతరం గ్రామాల్లో పైపులైన్లు వేసి ఇంటింటికి నీళ్లు పంపాలని చెప్పారు. ప్రతీ ఇంటిలో నల్లా బిగించడమే ఈ పథకంలో అతిపెద్ద పని అని, ఈ పని వేగంగా పూర్తి కావడానికి అవసరమైన ఆచరణాత్మక వ్యూహం రూపొందించాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, ఎస్డిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్.పి. సింగ్, ఆర్.డబ్ల్యుఎస్ ఇఎన్సీ సురేందర్ రెడ్డి, సిఇ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, మోటార్ల ఫిటింగ్ తదితర పనులన్నీ 2017 డిసెంబర్ నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణంతో సహా అన్ని పనులు సమాంతరంగా జరగాలని సూచించారు. గ్రామాల వరకు చేరిన నీళ్లను అంతర్గత పైపులైన్ల ద్వారా ఇంటింటికి అందించాలన్నారు. ప్రభుత్వం తరుఫునే నల్లాలు కూడా కొని ప్రతీ ఇంటిలో బిగించాలని చెప్పారు. ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు మిషన్ భగీరథ పథకం ద్వారా అందే నీళ్లతో ఎంత ఆనందంగా ఉన్నారో, త్వరలోనే రాష్ట్ర ప్రజలంతా ఆ అనుభూతి పొందాలని ఆకాంక్షించారు. 20 ఏండ్ల కిందే సిద్దిపేట నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా నీళ్లిచ్చామని, అదే స్పూర్తితో ఈ కార్యక్రమం రూపొందించినట్లు పునరుద్ఘాటించారు. నల్లాల దగ్గర బిందెల యుద్ధం బంద్ కావాలని, ఎవరింట్లో వాళ్లు బయటకు రాకుండా నీళ్లు పొందాలని చెప్పారు.
గ్రామాల్లో ఇంటింటికి నీళ్లిచ్చే కార్యక్రమం దళిత వాడల నుంచే ప్రారంభం కావాలని, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలతో సహా ప్రతీ ఇంటికి తప్పక నీరు చేరేలా చూడాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు ఇంతకాలం నిర్లక్ష్యానికి గురయ్యాయని, మంచినీటి పథకం వారితోనే ప్రారంభం కావాలని చెప్పారు.
మిషన్ భగీరథ కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది ప్రజలకు అత్యంత ముఖ్యమైనదీ అయనందున మంత్రులు, కలెక్టర్లు జిల్లాలు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని సిఎం కోరారు. పనులు జరుగుతున్న చోటికి వెళ్లి పరిశీలించాలని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. రైల్వే, రోడ్ల క్రాసింగులు దాటుకుని, ఫారెస్ట్ క్లియరెన్సులు సాధించి, ప్రైవేటు భూముల యజమానులను ఒప్పించి రికార్డు సమయంలో పైపులైన్ల నిర్మాణం చేసుకోవడాన్ని దేశమంతా గుర్తించి, అభినందిస్తున్నదని సిఎం చెప్పారు. ఇదే స్పూర్తితో మిగతా పనులు కూడా జరగాలని చెప్పారు. మంత్రులు, కలెక్టర్లకు మిషన్ భగీరథ పనుల వివరాలు అందివ్వాలని, తమ పరిధిలో వారు పర్యటించి పర్యవేక్షిస్తారని వివరించారు. ఎక్కడైనా పనులు అనుకున్నవేగంతో జరగకుంటే వెంటనే వర్కింగ్ ఏజన్సీలతో మాట్లాడాలని మిషన్ భగీరథ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమం కోసం అవసరమైన విద్యుత్ ను నిరంతరం అందించే ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం విద్యుత్ శాఖ అధికారులు, మిషన్ భగీరథ అధికారుల మధ్య సమన్వయం ఉండాలని సిఎం చెప్పారు. అవసరమైన విద్యుత్ ను ఏ సబ్ స్టేషన్ నుంచి ఎంత పొందాలనే విషయంలో అంచనాలు వేసుకుని అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.
నీటి పారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని మంచినీటి కోసం రిజర్వు చేసినందున ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నీటిని ఎక్కడికక్కడ వాడుకోవడానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లతో మిషన్ భగీరథ అనుసంధానం కావాలన్నారు. మిషన్ భగీరథ సామాగ్రిని మండలాల్లోని గోదాముల్లో నిల్వ చేసుకోవాలని సూచించారు.
మిషన్ భగీరథ కార్యక్రమానికి నిధుల కొరత లేదని, ఇప్పటికే అనేక ఆర్థిక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని సిఎం చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో కూడా కొంత కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. సకాలంలో పనులు చేసిన ఏజన్సీలకు ఇన్సెంటివ్ ఇచ్చే విధానం కూడా ఉన్నందున దాన్ని వినియోగించుకోవాలని సిఎం కోరారు.
బిహెచ్ఇఎల్ ద్వారా ఎలక్ట్రో మెకానికల్ పనులు
———————————————–
మిషన్ భగీరథ కోసం ఉపయోగించే ఎలక్ట్రో మెకానికల్ పరికరాలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన బి.హెచ్.ఇ.ఎల్. ద్వారా కొనుగోలు చేయాలని సిఎం ఆదేశించారు. మోటార్లు, పంపింగ్ సామాగ్రి కోసం టెండర్లు పిలిచినప్పటికీ పలు కంపెనీలు ధర విషయంలో బేరసారాలు దిగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. మిషన్ భగీరథకు పెద్ద ఎత్తున మోటార్లు, పంపింగ్ సామాగ్రి అవసరం ఉన్నందున, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్ఇఎల్ ద్వారానే వాటిని సమకూర్చుకోవాలన్నారు. ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో బిహెచ్ఇఎల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పుడు మిషన్ భగీరథలో కూడా అలాగే జరగాలని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థతో పని తీసుకోవడం వల్ల అనవసర రాద్దాంతాలేవీ ఉండవని కూడా సిఎం అభిప్రాయపడ్డారు. బిహెచ్ఇఎల్ సిఎండి అతుల్ సోమ్టితో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. మిషన్ భగీరథ కోసం 50 హెచ్.పి.ల నుంచి 1000 హెచ్.పి. ల వరకు మోటార్లు కావాలని, వాటిని సమకూర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, బిహెచ్ఇఎల్ అధికారులు త్వరలోనే సమావేశమై ఈ విషయంలో అవగాహనకు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.