మిషన్ కాకతీయ మూడవ దశ కింద చేపట్టవలసిన పనుల ప్రతిపాదనలు డిసెంబర్ లోగా సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు

డిసెంబర్ లోగా మిషన్ కాకతీయ- 3 ప్రతిపాదనలు.   ఎం. కె – 1, ఎం. కె – 2 పై సమీక్ష.  ఆదిలాబాద్ లో అద్భుత ఫలితం.  లక్ష ఎకరాల అదనపు ఆయకట్టు :  మంత్రి హరీశ్ రావు .
మిషన్ కాకతీయ మూడవ దశ కింద చేపట్టవలసిన పనుల ప్రతిపాదనలు డిసెంబర్ లోగా సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సోమవారం నాడిక్కడ జల సౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. మిషన్ కాకతీయ 1 , మిషన్ కాకతీయ 2 దశలలో చేపట్టిన పనులు, ఫలితాలను హరీశ్ రావు సమీక్షించారు. మిషన్ కాకతీయ కార్యక్రమం కింద చేపట్టిన పనులతో ఒక్క ఆదిలాబాద్ లో జిల్లా లో లక్ష ఎకరాలకు అదనంగా సాగనీరందించడం రికార్డు అని మంత్రి అభిప్రాయపడ్డారు.

ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ ఫలితాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. భూగర్భ జల సంపద పెరిగిన తీరుతో పాటు పెరిగిన సాగు విస్తీర్ణం, చేపలు పట్టుకొని జీవించే వారి జీవితాల్లో వచ్చిన మార్పు, వారి ఆర్ధిక పరిస్థితిలో మెరుగుదల తదితర అంశాలపై అధ్యయనం చేసి అంశాల వారీగా నివేదికలు తయారు చేయవలసిందిగా మంత్రి కోరారు.

మిషన్ కాకతీయ మూడో దశ కింద చేపట్టవలసిన పనులకు సంబంధించిన మార్గ దర్శకాలను మంత్రి హరీశ్ రావు విడుదల చేశారు. వర్షాలు కురవకపోవడంతో కరవు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు మిషన్ కాకతీయ మూడవ దశలో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి తదితర జిల్లాలలో ఇలాంటి ప్రాంతాలను గుర్తించి చెరువుల పునరుద్ధరణ జరపాలని కోరారు. మిషన్ కాకతీయ రెండో దశలో పూర్తి కాకుండా మిగిలి పోయిన పనులన్నిటినీ మూడవ దశలో చేపట్టాలని కోరారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న, కట్ట తెగిన  చెరువుల మరమ్మతు పనులు చేపట్టాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

గొలుసు కట్టు చెరువులకు చెందిన ఫీడర్ చానళ్ళు, డైవర్షన్ చానళ్ల పనులు మిషన్ కాకతీయ కింద చేపట్టాలని సూచించారు. ఆయకట్టు లోకలైజేషన్ చేయాలని, రెవిన్యూ అధికార యంత్రాంగం సహకారంతో చెరువుల ఎఫ్. టి. ఎల్ నిర్ధారించాలని కోరారు. ఆయకట్టు మ్యాపులను సిద్ధం చేయాలన్నారు. కొత్త చెరువులను నిర్మించడం కోసం హైడ్రాలిక్ క్లియరెన్సు,  సర్వే పనులు  ఇతర కార్యక్రమాల అంచనాలు, ప్రతిపాదనలు డిసెంబర్ 9వ తేదీలోగా సమర్పించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. పెండింగ్ లో ఉన్న మినీ ట్యాంక్ బండ్ పనులు ఎంకె త్రీ కింద పూర్తి చేయాలని కోరారు.ఈ సమీక్ష సమావేశంలో సి.ఇలు హరిరామ్, నాగేందర్ రావు, సురేష్, ఓఎస్డి శ్రీధర్ రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.

 

<
>
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.